అథ్లెట్ మెడకు వ్యభిచార ఉచ్చు

అథ్లెట్ మెడకు వ్యభిచార ఉచ్చు
 సింగపూర్: సింగపూర్ కు చెందిన పారా అథ్లెట్ ఒకరు కటకటాలపాలయ్యాడు. వ్యభిచారం చేయించేందుకు సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్ ద్వారా మహిళలను, మైనర్లను కొనుగోలు చేస్తున్నందుకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 38 నెలల జైలు శిక్ష విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అదామ్ కామిస్ అనే వ్యక్తి సింగపూర్ జాతీయ పారా అథ్లెట్ గా ఉన్నాడు. ఓ ప్రమాదంలో గాయపడిన అతడు వికలాంగుడిగా మారాడు. 2013లో ఫేస్ బుక్ ఖాతా తెరిచి దానిద్వారా వ్యభిచారం చేయించేందుకు 11మంది మహిళలను రిక్రూట్ చేశాడు. ఒక మైనర్ బాలికను కూడా రిక్రూట్ చేసి వ్యభిచార కూపంలోకి దించాడు.

వారి వద్ద నుంచి ఐదు నుంచి యాబై శాతం వరకు కమిషన్ తీసుకునే వాడు. ఒక ఎస్కార్ట్ ఉద్యోగిగా తనను తాను పరిచయం చేసుకొని డబ్బు ఎరగా వేసేవాడు. వెంటనే డబ్బు దక్కుతుందని ఆశతో మహిళలు తొందరగా అతడితో మాటలు కలిపేవారు. ఆ క్రమంలో వారిని వ్యభిచారంలోకి మెల్లగా లాగేవాడు. ఇక పదహారేళ్ల విద్యార్థినిని కలిసి తన అపార్ట్ మెంట్కు తీసుకెళ్లి లైంగికంగా అనుభవించడమే కాకుండా ఆమెతో కూడా వ్యభిచారం చేయించే కుట్ర చేశాడు. ఎంతో చాకచక్యంతో పోలీసులు ఈ విషయాన్ని గ్రహించి అతడిని అరెస్టు చేశారు. 30 అభియోగాల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. గతంలో 2010లో ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్కు ప్రతినిధిగా కూడా పనిచేశాడు.