అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు

Rio Olympic 2016మూడు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌ కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ జట్టు.. తొలి మ్యాచ్‌ లోనే అదరగొట్టింది. అద్భుతమైన ఆటతీరుతో తమ కంటే మెరుగైన జపాన్‌ ను నిలువరించి.. 2-2 తేడాతో మ్యాచ్‌ ను డ్రా చేసుకుంది. ఫస్ట్‌ హాఫ్‌ లోనే 2-0 తేడాతో జపాన్‌ అధిక్యంలోకి దూసుకెళ్లినా.. సెకండ్‌ హాఫ్‌ లో రాణి రాంపాల్, లిలిమా మింజ్‌ చెరో ఫెనాల్టీ కార్నర్‌ లను గోల్స్‌ గా మలచడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

జపాన్‌ తో తొలి మ్యాచ్‌ లో ఆరంభం నుంచే భారత క్రీడాకారిణిలు చెలరేగారు. అయితే గోల్‌ చేసే అవకాశాలను పలు సార్లు చేజార్చుకోవడంతో.. ఫస్ట్‌ హాఫ్‌ లో జపాన్‌దే పై చేయిగా నిలిచింది. భారత ఆటగాళ్ల బలహీనతలను ఆసరాగా చేసుకొని జపాన్‌ ప్లేయర్లు మ్యాచ్‌ పై పట్టు బిగించారు. ఫస్ట్‌ హాఫ్‌ ముగిసేసరికి 2-0తేడాతో అధిక్యంలో నిలిచారు. అయితే సెకండ్‌ హాఫ్‌ ప్రారంభంకాగానే.. వ్యూహం మార్చిన టీమ్‌ హాకీ.. జపాన్‌ గోల్‌ పోస్ట్ పై పదే పదే దాడులు చేసింది. దాంతో తమకు లభించిన రెండు ఫెనాల్టీ కార్నర్‌ లను భారత ప్లేయర్లు సద్వినియోగం చేసుకొని.. జపాన్‌ అధిక్యాన్ని 2-2 కు తగ్గించారు.

మ్యాచ్‌ చివరి దశలో భారత ఆటగాళ్లు మరో గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. జపాన్‌ ప్లేయర్లు నేర్పుగా అడ్డుకున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని గోల్ గా మలచడానికి ప్రయత్నించినా.. సఫలం కాలేకపోవడంతో.. మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఫస్ట్‌ మ్యాచ్‌ లోనే మెరుగ్గా రాణించిన భారత మహిళల హాకీ టీమ్.. తమ రెండో మ్యాచ్‌లో గ్రేట్‌ బ్రిటన్‌ తో తలపడనున్నది.