అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
– వెనకాలే వచ్చిన రెండు బస్సులు, కారు ఢీ
– ఓ బస్సు డ్రైవర్ మృతి, 29మంది ప్రయాణీకులకు గాయాలు
– క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రులకు తరలింపు
– బాధితులను పరామర్శించిన కృష్ణా జిల్లా కలెక్టర్
జగ్గయ్యపేట,ఆగస్టు 7(జనంసాక్షి): కృష్ణాజిల్లా విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్ బస్సుతో పాటు మరో రెండు బస్సులు, కారు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ మృతిచెందగా, మూడు బస్సుల్లో ప్రయాణిస్తున్న 29మందికి గాయాలుయ్యాయి. సినీ సన్నివేశాన్ని తలిపిస్తూ జరిగిన ఈ ప్రమాదం వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మంగళవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్ బస్సు గరికపాడు వద్ద అదుపుతప్పి డివైడరును ఢీకొట్టింది. అదే సమయంలో ఆ బస్సు వెనుక వస్తున్న మరో రెండు ప్రైవేటు బస్సులు, ఓ కారు ఒకదానికొకటి ఢీకొట్టాయి. మొత్తం మూడు బస్సులు, కారు వేగంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ బస్సు ఒకరు మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 10మంది విజయవాడ ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడిని రెండో బస్సు డ్రైవర్ విశాఖకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావుగా పోలిసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు డివైడర్‌ను ఢీకొట్టిందని బస్సులోని ప్రయాణీకులు పేర్కొన్నారు. కాగా అదే సమయంలో రెండు బస్సులు, కారు రావడంతో ప్రమాద తీవ్రవ కొంచెం పెరిగిందని అన్నారు. కాగా పెద్ద ప్రమాదం జరగకపోవటంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.
క్షతగాత్రులకు కలెక్టర్ పరామర్శ..
గరికపాడు చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై కలెక్టర్ బి.లక్ష్మీ కాంతం స్పందించారు. విజయవాడ గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.
అందరి ఆరోగ్యం బాగానే ఉందని…, ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని కలెక్టర్ లక్ష్మీ కాంతం పేర్కొన్నారు. మరో వైపు ప్రమాద ఘటన పై ఎంపీ కేశినేని నాని, స్థానిక మంత్రి అచ్చెం నాయుడు, ఎమ్మెల్యేలు ఆరా తీరశారు.