అధికారులు ఎవరూ సెలవు పెట్టొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాలతో జనం ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో సెలవులు పెట్టొద్దంటూ అధికారులను ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో అలర్ట్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. అవసరమైతే జనాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ప్రాణ నష్టం నివారించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురైతే ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వరదలతో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.