అధికార దాహమే జగన్ లక్ష్యం
అభివృద్ధిలో దూసుకు పోవాలన్నదే మా స్వప్నం :కాల్వ
అమరావతి,జూలై17(జనం సాక్షి): రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రుల సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని ముఖ్యమంత్రి కాంక్షిస్తుంటే అందుకు భిన్నంగా జగన్ రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అవినీతికి కేరాఫ్‌గా ఉన్న జగన్ రైతు సంక్షేమంపై మాట్లాడటం మరింత విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా వేల కోట్ల రూపాయలు వెచ్చించామని, పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లోకి వెళ్లి చూడవచ్చన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంపై చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని నిరంతరంఅడ్డుకుంటూ ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేత ¬దాకు అనర్హుడని మంత్రి ఆరోపించారు.ప్రభుత్వం ప్రతిసంక్షేమ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టి నిర్వహిస్తోందని అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న అరాచక ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సోలార్, విండ్‌మిల్స్, ఎనర్జీ ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి ఏం మాట్లాడినా అందులో అధికార దాహం తప్పించి అర్థం ఉండట్లేదన్నారు. గడచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు.. అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత చర్చను ప్రజల్లోకి తెదేపా శ్రేణులు తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిలా పార్టీ శ్రేణులంతా బాధ్యతగా పనిచేస్తే వచ్చే 30 ఏళ్లు రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎపి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. లోటుబడ్జెట్‌లో ఉన్నా అనేక పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.రాష్ట్రం రూ.16,500 కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూల అమలులో భాగంగా రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఐదురెట్లు పింఛన్ల పెంపుదలకు రూ.44 వేల కోట్లు వెచ్చించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్నారు. తన సమర్థ పాలన ద్వారా రాష్ట్రమంతటా ప్రస్తుతం చంద్రబాబువైపే చూసే పరిస్థితి తెచ్చారన్నారు. నదుల అనుసంధానంతో కరవురహిత రాష్ట్రంగా ఏపీని మారబోతుందన్నారు. 990 కిలోవిూటర్ల పొడవు తీరప్రాంతం ఉండటం అంతర్జాతీయంగా అది అభివృద్ధి చెందబోతుండటం రాష్ట్రానికి శుభపరిణామమన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల్ని గత ప్రభుత్వాలు వారి సంక్షేమానికి ఖర్చు చేయలేదని ఓసీలతో సమానంగా బలహీనవర్గాలు అభివృద్ధి చేయాలనే తలంపుతో ఆ నిధుల్ని పక్కాగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి అన్ని సామాజికవర్గాల అభ్యున్నతికి ఎక్కడా లేని విధంగా కృషి జరుగుతుందన్నారు. రూ.15 ప్రీమియంతో రూ.5 లక్షలు బీమా పరిహారం అందించే చంద్రన్న బీమా వంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు.