అధికార వివాదంపై.. అధికార వివాదంపై.. 

కోర్టుకెక్కిన ఢిల్లీ ప్రభుత్వం
– సుప్రీం చెప్పినా మాకు అధికారాలు ఇవ్వట్లేదని ఫిర్యాదు
న్యూఢిల్లీ, జులై18(జ‌నం సాక్షి) : లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న అధికార వివాదంపై ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకెక్కింది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు లేవని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వానికి, కేంద్ర సర్కారుకు మధ్య ఘర్షణ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్ర నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయితే రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పినప్పటికీ.. తమకు ఎలాంటి అధికారాలు ఇవ్వట్లేదని ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత కూడా తాము అధికారుల బదిలీలు, నియామకాలు చేపట్టలేకపోతున్నామని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. మేం కొత్త అధికారులను నియమించుకోలేకపోతున్నాం. అధికారులను బదిలీ చేయలేకపోతున్నాం. దీనిపై త్వరగా విచారణ చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది పి.చిదంబరం ధర్మాసనాన్ని కోరారు. ఆప్‌ ప్రభుత్వం వాదనలు విన్న ధర్మాసనం దీనిపై విచారణను జులై 26కు వాయిదా వేసింది. 2014 నుంచి కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రక తీర్పు వెల్లడించింది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు లేదని, మంత్రిమండలి సలహా మేరకు ఆయన నడుచుకోవాలని స్పష్టం చేసింది. శాంతి భద్రతలు, పోలీసులు, భూమి సంబంధిత అంశాలు… ఈ మూడు మినహా మిగిలిన అన్నింటిపై శాసనాలు చేసుకునేందుకు, పాలించేందుకు ఢిల్లీ శాసనసభకు అధికారాలున్నాయని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. అయితే ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి వివాదంపై చిన్నస్థాయి ధర్మాసనం వేరుగా విచారిస్తుందని ఆ సమయంలో రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. దీంతో అధికారుల బదిలీల అంశంపై ఢిల్లీ ప్రభుత్వం బుధవారం జస్టిస్‌ ఏకే సిక్రీ, నవీన్‌ సిన్హాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించింది.