అధిక దిగుబడుల కోసం కొత్త పథకం
ఆదిలాబాద్, జూన్ 8 (జనంసాక్షి): ఆధునిక పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు గాను, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రైతులు పంట సాగులో ఆచరిస్తున్న విధానాల్లో లోపాలను సవరించేందుకు ప్రతి గ్రామానికి ఒక ‘మాదిరి వ్యవసాయ క్షేత్రం’ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 733 క్షేత్రాలను ఏర్పాటు చేసి 733 మంది అభ్యుదయ రైతులను ఎంపిక చేయనున్నది. ఈ క్షేత్రాల్లో పత్తిలో 482, వరిలో 155, సోయాలో 36, మొక్క జొన్నలో 27, కంది పంటకు గాను 03 వ్యవసాయ క్షేత్రాలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఈ క్షేత్రాల నిర్వహణకు వ్యవసాయం పట్ల అవగాహన కలిగి సొంత భూమి ఉన్న రైతులను ఎంపిక చేయనున్నారు. రైతులు ప్రస్తుతం ఆచరిస్తున్న పద్ధతుల్లో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి రైతులకు సూచనలు సలహాలు అందజేయనున్నారు.