అధిక వడ్డీ పేరుతో కన్నకూతురికే వేధింపులు
– కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కుమార్తె
విజయవాడ, జులై17(జనం సాక్షి) : కన్నకూతురికి పెళ్లి చేసి కట్నకానుకలు ఇచ్చి పంపే తల్లిదండ్రులను చూస్తుంటాం. కుమార్తె పేరిట ఏదైనా ఆస్తి రాసే తండ్రిని చూస్తుంటాం. కానీ ఈ తండ్రి మాత్రం.. కూతురు స్థలం కొనుక్కుంటామని చెబితే రూ.5లక్షలు ఇచ్చి.. వడ్డీ పేరుతో ఏకంగా రూ.15లక్షలు వసూలు చేశాడు. మరో రూ.5లక్షలు ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కన్నతండ్రి వేధింపులు భరించలేని కూతురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. కృష్ణా జిల్లా తునికిపాడు గ్రామానికి చెందిన కిలారు హనుమంతరావు కొన్ని సంవత్సరాల క్రితం తన కుమార్తె చంద్రలేఖకు రూ.5లక్షలు ఇచ్చాడు. రెండు సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి రూ.8లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె ఆ మొత్తాన్ని ఇచ్చే సమయంలో వడ్డీతో కలిపి మొత్తం రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయినప్పటికీ అతడి దాహం తీరక.. మరో రూ.5లక్షలు ఇవ్వాలంటూ ఇటీవల ఒత్తిడి తెస్తున్నాడు. కుమార్తె ఇవ్వకపోవడంతో ఆమెకున్న నాలుగున్నర ఎకరాల పొలంలో పంటసాగు చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో చంద్రలేఖ తన తండ్రి వేధింపులపై కృష్ణా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ దర్యాప్తు చేసి హనుమంతరావుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొన్నేళ్ల క్రితం మేము బెంగళూరులో స్థలం కొనుక్కుంటున్నామని చెబితే నా తండ్రి హనుమంతరావు రూ.5లక్షలు ఇచ్చారు. తొలుత బహుమతిగా ఇచ్చామని చెప్పి రెండు సంవత్సరాలు అయ్యాక మొత్తం రూ.8లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. అవి ఇచ్చాక వడ్డీతో కలిసి రూ.15లక్షలు అయిందని చెప్పాడు. ఆ డబ్బులు కూడా ఇచ్చాక మరో రూ.5లక్షలు కావాలని ఒత్తిడి తెస్తున్నాడు. మాకున్న నాలుగున్నర ఎకరాల్లో పంట సాగు చేయకుండా అడ్డుకుంటున్నాడు. ఆయనపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కలెక్టర్ ఫిర్యాదు చేశాను’ అని హనుమంతరావు కుమార్తె చంద్రలేఖ విూడియాతో చెప్పారు.
————————————