అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఉండు..లేదంటే పార్టీని వీడు..!
– కబ్జాకోరు నారాయణరెడ్డికి టికెట్ అడిగే సీనెక్కడిది
– కబ్జా చేసిన భూములు కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌లో చేరి ఇప్పుడు కుట్రలా?
– ఉద్యమకారులం తిరుగబడితే కాటారంలో ఉండవు
– నారాయణరెడ్డికి ఉద్యమకారుల హెచ్చరిక
జనం సాక్షి మంథని :కాంగ్రెస్ కోవర్ట్‌గా మారిన చల్ల నారాయణరెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి ద్రోహం చేస్తే సహించేది లేదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఎక్కేటి అనంతరెడ్డి, కావేటి సతీష్‌లు హెచ్చరించారు. సోమవారం మంథని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీలో పనిచేయాలని ఉంటే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని లేదంటే నిరభ్యరంతరంగా పార్టీని వీడొచ్చని వారు పేర్కొన్నారు. అంతేకాని కాంగ్రెస్ పార్టీకి మేలు చేయడానికి ఉద్యమ ద్రోహులంతా ఒక్కచోట చేరి పార్టీకి నష్టం చేయడానికి కుట్రలు పన్నితే తరిమికొట్టాల్సి వస్తుందన్నారు. భూ కబ్జాదారుడు చల్ల నారాయణరెడ్డి తనకు తాను ఎక్కువగా ఊహించు కుంటున్నాడని, ఆయనకు టికెట్ అడిగే సీనెక్కడిదని వారు ఎద్దేవా చేశారు. కబ్జా చేసిన భూములను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌లో చేరిన నారాయణరెడ్డి నువ్వు ఎంత గింజుకున్నా మండల స్థాయి నాయకునివే తప్ప నియోజక వర్గంలో నిన్ను ఎవరూ నాయకునిగా గుర్తించే పరిస్థితి లేదని తెలిపారు. మీటింగ్‌కు కూళీ డబ్బులు ఇచ్చి తీసుకువచ్చి తన బలగం అని చెప్పుకోవడం సిగ్గుచేటని, ఆ కూళీ డబ్బులు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే దగ్గర అడుక్కున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్క తన బుద్ది మార్చుకోదని నారాయణరెడ్డి విషయంలో మరోసారి స్పష్టమైందని, ఉద్యమ ద్రోహులందరినీ ఒక్కచోట చేర్చి కుట్ర పన్నుతున్నాడని తెలిపారు. నారాయణరెడ్డి ఒక్క విషయం గమనించాలని వేదిక మీద కూర్చున్న ఒక్క నాయకునికైనా తెలంగాణ ఉద్యమం చేసిన చరిత్ర ఉందా? అని వారు ప్రశ్నించారు. నాగినేని జగన్మోహన్‌రెడ్డికి ఎలక్షన్లు రాగానే కలెక్షన్లు గుర్తస్తాయని, రామగిరి ఎంపీపీ దంపతులు అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టిన రకమని విమర్శించారు. ఇక ముత్తారం మండలం సర్పంచ్‌లు బక్కారావు, రమేష్‌ల చరిత్ర వారి గ్రామ ప్రజలను అడిగితే తెలుస్తుందని, ఇలాంటి ద్రోహులు ఎంతమంది కలిసినా బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని వివరించారు. పార్టీ ద్రోహి ఖబడ్దార్ చల్లనారాయణరెడ్డి తెలంగాణ ఉద్యమకారులం తిరుగబడితే కాటారంలో ఉండలేవని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఉద్యమకారుల ఫోరం మంథని మండల అద్యక్షుడు గోగుల రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి కుంట బద్రి, రాష్ట్ర కార్యదర్శి మంథని విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి పొయిల బాపు, పిఏసిఎస్ డైరెక్టర్ దేవళ్ల విజయ్ కుమార్, నాయకులు కాసిపేట రామన్న, కాసిపేట రమేష్, గంగధరి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.