అనంతపురం ఎస్‌బీఐలో దోపిడీ

– కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
– ఇద్దరు వ్యక్తులు దోపిడీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు
అనంతపురం, జులై28(జ‌నం సాక్షి) : నగరంలోని జెఎన్టీయూ క్యాంపస్‌కు అనుబంధంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో దోపీడీ జరిగింది.  శుక్రవారం అర్ధరాత్రి దుండగులు బ్యాంకు వెనకవైపు కిటికి గ్రిల్స్‌ తొలగించి లోపలకి చొరబడ్డారు. గ్యాస్‌ కట్టర్‌తో బ్యాంక్‌ స్టాంగ్‌రూమ్‌ను పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. అధికారులు శనివారం ఉదయం బ్యాంకులో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు దుండగులు బ్యాంకులోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బ్యాంకు స్టాంగ్‌ రూమ్‌లో మూడు అరలు ఉన్నాయని.. అందులో నగదు ఉన్న అరకు గ్యాస్‌ కట్టర్‌తో రంధ్రం చేశారని తెలిపారు. ఆ అరలో సుమారు రూ.41 లక్షల నగదు ఉందని.. అందులో ఎంత మొత్తం చోరీకి గురైందో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన సొమ్ము తేల్చేందుకు బ్యాంకు సిబ్బంది నగదును లెక్కిస్తున్నారు. డీఎస్పీ వెంకట్రావ్‌ పర్యవేక్షణలో సిబ్బంది నగదు లెక్కింపు చేపట్టారు. కాగా సీసీ కెమేరాల ద్వారా ఇద్దరు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు
———————————-

తాజావార్తలు