అనాధికారిక కోతలతో సతమతమవుతున్న ప్రజలు

ఆదిలాబాద్‌, జనవరి 4 (): జిల్లాలో తిరిగి అనాధికారి విద్యుత్‌ కోతలు మొదలు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా విద్యుత్‌ సరఫరా అష్టవ్యష్టంగా మారడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ కోతల విషయమై విద్యుత్‌ శాఖ అధికారులు సమాధానం చెప్పేందుకు నిరాకరించడంతో విద్యుత్‌ కోత విషయమై ఎవరిని అడగాలో తెలియకుండా పోయింది. మూడు రోజులుగా గంటల తరబడి కోతలు విధిస్తుండడంతో వినియోగదారులకు పాలుపోవడం లేదు. విద్యుత్‌ శాఖ అధికారులు కోతలపై ఎలాంటి పత్రిక ప్రకటనలు చేయకపోవడం, పెదవి విప్పకపోవడంతో వినియోగదారులు కష్టాలు పడుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు అర్థ వార్షిక పరీక్షలు ప్రారంభం కావడంతో కోతల వల్ల చదువులు ముందుకు సాగడం లేదు. జిల్లాకు అవసరాలను బట్టి ప్రతి రోజు ఆరు మిలియన్‌ యూనిట్లు కేటాయించగా, అందులో ఐదు మిలియన్‌ యూనిట్లు ఖర్చు అవుతున్న ఈ విద్యుత్‌ కోతలు ఎందుకు విధిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. గత మూడు రోజులుగా చలి తగ్గిపోయి వాతావరణంలో మార్పులు రావడంతో విద్యుత్‌ వినియోగం పెరిగినప్పటికీ జిల్లాకు కేటాయించిన యూనిట్లకు మించి వినియోగం కాకున్నప్పటికీ ఈ విద్యుత్‌ కోతలు ఎందుకు విధిస్తున్నారో తెలియడం లేదు. ఈ విద్యుత్‌ కోతలపై ఆ శాఖ కార్యాలయం ముందు రైతులు, ప్రజలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన అధికారుల్లో కదలికలు లేవు. ఈ విద్యుత్‌ కోతలు ఎందుకు విధిస్తున్నారో ఏయే సమయాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదో వాటి వివరాలను విద్యుత్‌ శాఖ అధికారులు పత్రికా ముఖంగా తెలియజేయాలని వారు డిమాండ్‌ చేశారు.