అప్పుడూ..ఇప్పుడూ బిజెపిపైనే అవిశ్వాసం

2003 తరవాత మళ్లీ అవిశ్వాసం

న్యూఢిల్లీ,జూలై18(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్‌లో టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఇక చర్చ ఎప్పుడన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. పదిరోజుల్లో ప్రకటిస్తానని చెబుతూ ఆతీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించారు. రెండుమూడు రోజుల్లో చర్చకు సంబంధించిన తేదీలు వెల్లడిస్తామని ఆమె తెలిపారు. అయితే 2003 తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ స్వీకరించడం ఇదే మొదటిసారి. దాదాపు 15 ఏళ్ల తరవాత మరోమారు లోక్‌సబళో అవిశ్‌ఆసం చర్చకు వస్తోంది. ఈ రెండో సారి కూడా బిజెపి ప్రభుత్వంపైనే రావడం విశేషం. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అయితే సాధారణంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలంటే దానికి 50 మంది ఎంపీల మద్దతు కావాలి. అవిశ్వాసంపై చర్చిస్తామని కూడా కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ స్పష్టం చేశారు. 2003లోనూ అప్పటి బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ తీర్మానాన్ని స్వీకరించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆ తీర్మానంలో విపక్షాలు ఓడిపోయాయి. 1999లో వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ కూటమి విశ్వాస తీర్మానంలో ఓటమిపాలైంది. జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీ మద్దతు ఉపసంహరించడంతో వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం ఆ ఓటింగ్‌లో ఓడిపోయింది.