అఫ్ఘాన్‌లో వలస కార్మికుల అష్టకష్టాలు


ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన
తమను స్వదేశానికి తీసుకుని రావాలని వినతి
హైదరాబాద్‌,ఆగస్ట్‌18జనంసాక్షి): అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత దయనీయ పరిస్థితులకు అక్కడ కష్టాలు
పడుతున్న వారు తమను రక్షించాలని కోరుకుంటున్నారు. అలాగే తమను త్వరగా స్వదేశం తీసుకుని వెళ్లాలని వేడుకుంటున్నారు. తెలంగాణకు చెందిన ఆదిలాబాద్‌, కరీంనరగ్‌, నిజామాబాద్‌ కార్మికులు పలువురు అక్కడ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పొట్ట చేత పట్టుకుని అఫ్గాన్‌కు వెళ్లిన తెలంగాణ వాసుల దయనీయంగా ఉంది. కొందరు అక్కడి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోగా మరికొందరు అక్కడే చిక్కుకుని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపు తున్నారు. అఫ్గాన్‌లోని మన విదేశాంగ కార్యాలయాన్ని ఉద్యోగులు ఖాళీ చేసినా అక్కడ చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎంతనేది ఇప్పటికీ తెలియట్లేదు. అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సైన్యం, నాటో సేనలు ఖాళీ చేస్తుండటం.. అంతలోనే తాలిబన్లు అఫ్గాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో వలస కార్మికుల్లో ఉపాధి కల చెదిరిపోయింది. ఫలితంగా తమ వీసాలకు గడువు ఉన్నా అఫ్గాన్‌ను వీడాల్సి వస్తుందని వలస కార్మికులు వాపోతున్నారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లిపోవడానికి గడువు సవిూపించింది. కాగా అమెరికన్‌ సైన్యంకు సేవలు అందించే ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని గుర్తించిన కొందరు తెలంగాణ యువకులు అఫ్గాన్‌లోనే ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కున్నారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో సైన్యం ఉపసంహరణ జరిగినా రాయబార కార్యాలయాలల్లో విధులు నిర్వహిస్తే తమ ఉద్యోగానికి ఢోకా ఉండదని వలస కార్మికులు భావించారు. ఈ క్రమంలో ఏజెన్సీల మెప్పు పొంది అమెరికా, ఇతర దేశాల రాయబార కార్యాలయాల్లో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కానీ అంతలోనే తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ మొత్తాన్ని వశం చేసుకోవడంతో అమెరికా సహా అన్ని దేశాల రాయబార కార్యాలయాలను ఖాళీ చేశాయి. ఈ క్రమంలో రాయబార కార్యాలయాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అమెరికా ఎంబసీకి అనుబంధంగా పని చేసే కార్మికులను నాలుగు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్లి రావడానికి సెలవులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కొందరు సెలవులపై ఇంటికి రాగా అఫ్గాన్‌లో మారిన పరిస్థితులతో మళ్లీ అక్కడకు వెళ్లలేకపోతున్నారు. చాలామంది బిక్కుబిక్కుమంటూ క్యాంపు గదిలోనే దాక్కున్నారు. సెల్‌ఫోన్‌లు వినియోగించ డానికి అనుమతి లేదు. తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో తెలియట్లేదు. చాలామంది ఇక్కడ చిక్కుకున్నట్లు అక్కడి నుంచి వార్తలు అందుతున్నాయి. 20 ఏళ్ల పాటు అమెరికా సైన్యం, నాటో దళాలకు సేవలు అందించిన తెలంగాణ వలస కార్మికులను అమెరికా ప్రభుత్వం చేరదీయాలనే డిమాండ్‌ వస్తోంది. అఫ్గాన్‌ పౌరులతోపాటు తెలంగాణ వలస కార్మికులకు కూడా అమెరికా తమ దేశ వీసాలను జారీ చేసి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.