అబ్దుల్ సత్తార్ ఈది కన్నుమూత
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ప్రఖ్యాత సంఘసేవకులు, దాత అబ్దుల్ సత్తార్ ఈది(88) గత రాత్రి ఇస్లామాబాద్‌లోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. పాక్‌లో అతిపెద్ద సంక్షేమ సంస్థ ‘ఈది ఫౌండేషన్’ను ఏర్పాటుచేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయనకు దేశవిదేశాల్లో ఎందరో అభిమానులు ఉన్నారు. దాంతో ఆయన మరణవార్త తెలియగానే మీడియా, సోషల్ మీడియాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నివాళులర్పిస్తున్నారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. గొప్ప మానవతావాది అని షరీఫ్ అబ్దుల్ సత్తార్ ఈది సేవలను కొనియాడారు. మరణానంతరం ఈది గౌరవార్థంగా ప్రెసిడెంట్స్ మెడల్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరిపించనున్నారు.
కిడ్నీ సంబంధిత సమస్యతో ఈది మరణించినట్లు ఇస్లామాబాద్‌లో ఆయన కుమారుడు ఫైసల్ విలేకరులకు వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈదిని ప్రత్యేక చికిత్స కోసం విదేశాలకు తరలిస్తామని ప్రభుత్వం కోరినా ఆయన నిరాకరించారు. తన దేశంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటానని చెప్పారు. ఈది ఫౌండేషన్ పాకిస్థాన్‌లో ఎన్నో అనాథాశ్రమాలు, మెడికల్ క్లినిక్‌లు, అంబులెన్స్‌లు నడుపుతోంది. పేదల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తోంది. తప్పిపోయి పాకిస్థాన్ చేరిన భారతీయ బాలిక గీత ఆశ్రయం పొంది, పెరిగి పెద్దదైంది ఈదీ ఫౌండేషన్‌లోనే.
ఈది మృతిపట్ల భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నివాళులర్పించారు. ఆయన జీవితాన్నంతా మానవ సేవకే వెచ్చించారని ఆమె కొనియాడారు. ఈది అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి వేలమంది హాజరయ్యే అవకాశం ఉంది.