అభివృద్ది ఆయన పథం

రాజకీయ నిష్టాగరిష్ఠుడు వాజ్‌పేయ్‌

భారత రాజకీయాలకు వెలుగుదివ్వె

న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి): అతి చిన్న వయసులోనే ఆరెస్సెస్‌ సిద్ధాంతాలతో ప్రభావితులైన వాజపేయి జీవితాన్నంతా సమాజ సేవకే అంకితం చేశారు. సంఘ్‌ సిద్ధాంతాల మూలంగా ఇతర రాజకీయపక్షాలు బీజేపీతో పొత్తు అంటేనే భయపడే రోజుల్లో సంకీర్ణ శకానికి ఆద్యుడుగా నిలిచిన మ¬న్నత రాజకీయ శిఖరం వాజ్‌పేయి. ఆయన చొరవ కారణంగా, ఆయనను చూసి అనేక పార్టీలు ఆనాడు బిజెపితో జతకట్టాయి. బీజేపీ ఒక దశలో ఏకాకిగా మారిపోయి,దానిని మతపార్టీగా ముద్రవేశారు. అయినా భిన్న భావజాలాలు గల 24 రాజకీయ పక్షాలను కూడదీసి ఎన్డీయేను ఏర్పాటుచేయడం వాజపేయి ఆమోదనీయతకు నిదర్శనం. సంకీర్ణ ధర్మాన్ని పాటించాలనే ఆయన విధానం ఎన్డీయేకు గట్టి పునాదులు వేసింది. దేశ ప్రధానిగా అందరి నేత అనిపించుకున్నారే తప్ప, ఒక వర్గానికో సంస్థకో పరిమితం కాలేదు. ప్రభుత్వ నియామకాలలో ఏ ఒత్తిడులకు లొంగలేదు. వివాదాస్పద అంశాల జోలికి పోకుండా దేశాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు.పార్టీ ఆదేశాల మేరకు రాజకీయపార్టీ నిర్మాణంలో చేరినా ఆయన ఏనాడూ సంఘ్‌ సిద్ధాంతాన్ని విడనాడలేదు. సంఘ్‌ కార్యకర్తగా భావించుకున్నప్పటికీ, పరిపాలనారంగంలో ఆ మొగ్గు కనిపించకుడా వ్యవహరించారు.సైద్ధాంతిక రాజకీయాలకు, ప్రజాస్వామిక పాలనావ్యవస్థకు మధ్య సమతుల్యత సాధించారు. వాజపేయి ప్రధానిగా, సోనియా ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సభా కార్యక్రమాలు హుందాగా సాగిన తీరు నేటితరం నాయకులకు ఆదర్శప్రాయం. ప్రత్యర్థులు కూడా గౌరవించేసంస్కారపూరితమైన వ్యవహారసరళి ఆయనది. వాజపేయి రాజకీయ జీవితమంతా తనను సంఘ్‌ కార్యకర్తగా భావించుకుంటూనే, దేశ రాజకీయాలలో నెగ్గుకుని వచ్చారు. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీతో చర్చించి 1951లో భారతీయ జనసంఘ్‌ స్థాపనకు ప్రేరేపించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో కొద్దికాలాన్ని మినహాయిస్తే, వాజపేయికి ఇదే రాజకీయ ప్రవేశం. అద్వానీ అంతటి నాయకుడు కూడా సంఘ్‌ పరివార్‌ ఆగ్రహానికి గురై ప్రాభవం కోల్పోవలసి వచ్చింది. వాజపేయి కూడా అనేక సందర్భాలలో సంఘ్‌ ఆలోచనా ధోరణికి భిన్నంగా కనిపించినా, రాజకీయపక్షాన్ని నిలదొక్కుకునేలా చేశారు. జనసంఘ్‌ను సమకాలీన రాజకీయాలకు అనుగుణంగా నడిపిస్తూ, 1977లో భిన్న సైద్ధాంతికపక్షాలతో విలీనం చేసి జనతాపార్టీ రూపంలో అధికారం చేపట్టేలా చేశారు. జనతాపార్టీలో ఉంటూ సంఘ్‌ బలోపేతం అవుతున్నదని భావించిన సోషలిస్టులు ద్వంద్వ సభ్యత్వ రద్దు నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ దశలో వాజపేయి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. బీజేపీ మరింత సరళంగా కనిపించింది. వాజపేయి ఒక దశలో గాంధేయ సోషలిజం, నిర్మాణాత్మక లౌకికవాదం నినాదాలు ఇవ్వడం సంఘ్‌ నాయకులకు నచ్చలేదంటారు. అయినా వాజపేయి నెగ్గుకురావడానికి ఆయన ఔన్నత్యం ఒక కారణమైతే, రాజకీయ చతురత మరో కారణం. వాజ్‌పేయ్‌ విదేశాంగ విధానం బాగా పటిష్టమైనదిగా చెప్పుకుంటారు. అందుకే ఇజ్రాయెల్‌తో స్నేహానికి ప్రాధాన్యం ఇచ్చారు. అమెరికాతో సంబంధాలను బలోపేతం చేశారు. చైనాకు విభేదాల పరిష్కారానికి కృషి చేశారు. ఢిల్లీ-లా¬ర్‌ బస్సును ప్రారంభించి పాకిస్థాన్‌తో చెలిమికి ప్రయత్నించారు. చారిత్రక లా¬ర్‌ బస్సు యాత్రతో పాకిస్థాన్‌కు స్నేహహస్తం సాచడంలో, కశ్మీరీలను అక్కున చేర్చుకొనేలా మానవీయ విధాన రూపకల్పనలో సౌభ్రాత్ర పరిమళాల్ని వెదజల్లిన వాజ్‌పేయీ- విశ్వాసఘాతుకంతో కార్గిల్‌ యుద్ధానికి కాలుదువ్విన ముషారఫ్‌ మూకల వెన్నువిరిచిన సాహసి. అణుశక్తి సంపన్న రాజ్యంగా ఇండియాను తీర్చిదిద్ది, అమెరికా సహా పలు దేశాలు విధించిన ఏకపక్ష ఆంక్షల్ని దీటుగా ఎదుర్కొని, అచిరకాలంలోనే అగ్రరాజ్యాలన్నింటితో భాగస్వామ్య బంధాల్ని బలీయంగా ముడివేసిన వాజ్‌పేయీ విదేశాంగ వ్యూహ విశారదుడు! వాజపేయి తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో- ఏకపక్ష రాజకీయాల స్థానంలో భిన్నత్వ పరిమళాన్ని వెదజల్లారు. సంకీర్ణ రాజకీయాలను ఆచరణ సాధ్యం చేశారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయపాలన అందించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేశారు. భారత ప్రజాస్వామిక విలువలను అర్థం చేసుకొని ఆచరించిన రాజనీతి కోవిదుడిగా, పాలనాదక్షుడిగా వాజపేయి స్థానం సుస్థిరమైనది. మా ఆత్మల్ని అమ్ముకోవాలనో, తాకట్టు పెట్టాలనో మేము అనుకోవడం లేదు’- అంటూ 1996లో పదమూన్నాళ్ల ప్రధానిగా పార్లమెంటులో వాజ్‌పేయీ చేసిన చారిత్రక ప్రసంగం ఆయన నైతిక నిష్ఠాగరిమకు ఘనతర ప్రతీకగా నిలిచింది. దేశ రాజకీయాల్లో కొడిగట్టిపోతున్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా భాజపాను జాతి ముందు నిలబెట్టడంలో ఆ కర్మయోగి రాజనీతిజ్ఞత, దూరదృష్టి నిరుపమానమైనవి. తొలుత దేశం, పిమ్మట పార్టీ, ఆ తరవాతే నేను అనే ఆదర్శవాదాన్ని ఆచరణలో పెట్టి, భాజపాకు విలక్షణ సైద్ధాంతిక పునాదుల్ని నిర్మించారు. ఆరు దశాబ్దాల ప్రజాజీవనంలో త్రికరణశుద్ధిగా నిబద్ధమైన వ్యక్తిగా నిలిచారు. పండిత నెహ్రూను అమితంగా అభిమానించడమే కాదు, ఆయన అభిమానం సంపాదించి భవిష్యత్‌ ప్రధాని అనిపంచుకున్న ఘనుడు. పదిసార్లు లోక్‌సభకు, రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికైన మహానేత భిన్న ¬దాల్లో జాతికి చేసిన సేవకు కొలామానాలు అక్కర్లేదు. బుడిబుడి అడుగుల దశలో ఉన్న ఆర్థిక సంస్కరణలకు ఒడుపును, వేగాన్ని అందించి ఎనిమిది శాతం వృద్ధిరేటును సాకారం చేసింది వాజ్‌పేయీ ప్రభుత్వం. సప్తవిధ అనుసంధాన పక్రియల ద్వారా యావత్‌ జాతినీ ఏకతాటిపైకి, ప్రగతిబాటలోకి నడిపించినఆయన సారథ్యం చిరస్మరణీయం. నాలుగు మహానగరాల్ని అనుసంధానించే స్వర్ణచతుర్భుజి, దానితోపాటే గ్రావిూణ రోడ్ల అనుసంధానం దేశార్థికాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. రైలు, విమాన, జలరవాణా సేవలతో పాటు అంతర్జాల విస్తృతి, టెలికాం విప్లవాలు ఇండియా ముఖచిత్రాన్నే మార్చేశాయి. 1999లో వాజ్‌పేయీ తెచ్చిన కొత్త టెలికాం విధానం వల్లనే దేశీయంగా మొబైల్‌ విప్లవం అద్భుతాలు సృష్టిస్తోంది. రాజకీయంగా ఆయన పొందిన దానికంటే దాంతో దేశానికి లాభం ఒనగూర్చిందే ఎక్కువ.