అభివృద్ధి పథకాలతో విపక్షాల బేజార్ : ఎమ్మెల్యే
మెదక్,అక్టోబర్5 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దోపిడీకి గురైన అన్ని కులవృత్తులను ఆదుకొని వారి
భవిష్యత్తుకు అన్నివిధాలా ప్రభుత్వమే భరోసా కల్పించే దిశగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామని అన్నారు. వికలాంగులకు రూ.1500లు, వృద్ధులు, వితంతువులకు రూ.1000 పింఛను అందజేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు. రైతులకు కోతలు లేకుండా నిరంతర విద్యుత్
అందిస్తున్న ఘనత కూడా కెసిఆర్‌దని అన్నారు. మత్స్యకారుల అభివృద్ది కోసం వారికి ఉచితంగా చేప విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా ఉచితంగా పంపిణీ జరగలేదన్నారు. మత్స్యకార కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, నదులు ఇలా అన్ని రకాల నీటి వనరుల్లో చేపలను వదులుతున్నట్లు చెప్పారు. గతంలో పనిచేసిన ప్రభుత్వాలు మత్స్యకారులను దోపిడీకి గురిచేస్తూ, దళారులకు కొమ్ముకాశాయని విమర్శించారు. స్వరాష్ట్రంలో మత్స్యకారులకు ఆ పరిస్థితి లేకుండా వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో అన్ని నీటి వనరులు కళకళలాడుతున్నాయని అన్నారు. చేప పిల్లల పంపిణితో సరిపెట్టకుండా వారికి మార్కెట్ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ప్రతి చోట మత్స్యకారులకు సంఘ భవనాలు మంజూరు చేస్తామన్నారు. తమ సొసైటీలను బలపర్చుకునే దిశగా ప్రతి ఒక్కరూ సభ్యత్వం పొందాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రతి చేప పిల్ల పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటూ విూ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దేశ విదేశాలకు చేపలు ఎగుమతి చేసే విధంగా మత్స్యకారులు తమ వృత్తిని అభివృద్ధి చేసుకోవాలన్నారు.భవిష్యత్తులో ప్రతి మత్స్యకారుడు కూలీగా కాకుండా యజమానులుగా మారాలన్నారు.