అమరావతి ఐటీ హబ్‌గా మారుతోంది
– ఏపీ అభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు కృషిచేస్తున్నారు
– కాంగ్రెస్, టీడీపీ పొత్తు ప్రసక్తి ఉండదు
– అసెంబ్లీకి రాని జగన్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు
– ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
అమరావతి, సెప్టెంబర్3(జనం సాక్షి) : నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఐటీ కంపెనీలు వరుస కడుతున్నాయని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. భవిష్యత్తులో అమరావతి ఐటీ హబ్‌గా మారుతుందని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మ్యాక్స్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి పుల్లారావుతో కలిసి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ అమరావతి ఐటీహబ్‌గా మారడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు, మంత్రి లోకేశ్ చొరవే దీనికి కారణమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత 90 శాతం ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని, ప్రస్తుతం ఐటీ కంపెనీలు అమరావతిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ఎక్కడో విదేశాల్లో కంటే మన ప్రాంతంలోనే ఐటీ ఉద్యోగాలు లభిస్తే ఆ సంతృప్తే వేరని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. అసెంబ్లీకి రాని జగన్‌కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచామని తెలిపారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని, రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరమని మంత్రి పుల్లారావు అన్నారు. అమరావతి, పోలవరం, నవ్యాంధప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, మరో ఐదేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. అమరావతి త్వరలోనే మరో సైబరాబాద్, బెంగళూరు కానుందని పుల్లారావు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొనకళ్ల నారాయణ, గోకరాజు గంగరాజు, ఆప్కో ఛైర్మన్ హనుమంతరావు, రాష్ట్ర ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐటీ సలహాదారు రవికుమార్, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ హాజరయ్యారు.
————————————