అమర్‌నాథ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు

16కు చేరిన మృతుల సంఖ్య
మరో 40మంది ఆచూకీ గల్లంతు
15వేల మందిని రక్షించిన రెస్క్యూ బృందాలు
తనకళ్లెదుటే దుర్ఘటన జరిగిందన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌

శ్రీనగర్‌,జూలై9(జనంసాక్షి): అమర్‌నాథ్‌ యాత్రలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతు న్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో అమర్‌నాథ్‌లో భారీ వరదలు సంభవించాయి. వేలాది మంది ఈ వరదల్లో చిక్కుకుని విలవిల్లాడారు. ఇప్పటివరకు 15వేల మందిని రక్షించగా..16 మంది మృతి చెందారు. 40మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, ఐటీబీపీ బృందాలతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ 21 మందికి మెరుగైన చికిత్స అందించేందుకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కు చెందిన హెలికాప్టర్‌ లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా లద్దాఖ్‌ లోయలో హెలికాప్టర్ల ద్వారా గాయపడిన యాత్రికులను బల్తాల్‌ కు తీసుకెళ్తున్నారు.ఆర్మీ అధికారులు జమ్మూకశ్మీర్‌ కు చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైనవారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కుండపోతగా వాన కురుస్తున్న సమయంలో అమర్‌నాథ్‌ గుహ దగ్గర దాదాపు 12 వేల మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం.
వరదల్లో చనిపోయిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. అమర్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులకు అన్ని విధాలుగా సాయం చేస్తున్నట్లు మోడీ తెలిపారు. అమర్‌ నాథ్‌ లో ప్రతికూల వాతావరణంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు వరదల్లో 16 మంది చనిపోయారని..40 మంది యాత్రికులు గల్లంతయ్యారని తెలిపారు. జమ్మూకశ్మీర్‌ లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయని..కొండచరియలు విరిగిపడలేదన్నారు. నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఆర్మీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సీఆర్‌ పీఎఫ్‌ బలగాలు రెస్క్యూ ఆపరేషన్‌ లో పాల్గొన్నాయన్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న ప్రారంభమైంది. భక్తులతో అమర్‌నాథ్‌ గుహ దగ్గరి బేస్‌ క్యాంప్‌ కిక్కిరిసి ఉంది. వందలాది మంది అక్కడ టెంట్లు వేసుకుని సేద తీరుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 సమయంలో ఆకాశానికి చిల్లుపడినట్లుగా అమర్‌నాథ్‌ గుహ ఎగువ ప్రాంతంలో కుంభవృష్టి కురిసిందని ఐఎండీ తెలిపింది. బేస్‌ క్యాంప్‌ దగ్గర కూడా భారీ వాన పడిరది. దీంతో కొద్దిసేపట్లోనే గుహపై నుంచి, పక్క నుం చి బురద, రాళ్లతో కూడిన వరద పోటెత్తింది. టెంట్లపైకి రావడం, అందులోని వాళ్లు పదుల సంఖ్యలో కొట్టుకుపోవడం క్షణాల్లో జరిగిపోయింది. 25కు పైగా టెంట్లు, 3కమ్యూనిటీ కిచెన్లు దెబ్బతిన్నాయని ఆఫీసర్లు చెప్పారు. పలు మృతదేహాలను రికవరీ చేశారు. ‘ఆకస్మిక వరదలకు కొన్ని లాంగర్లు (కమ్యూనిటీ కిచెన్‌), టెంట్లు కొట్టుకుపోయాయి. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిర్‌లిప్ట్‌ చేస్తున్నం. పరిస్థితి అదుపులోనే ఉందని కాశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు జూన్‌ 30 నుంచి అమర్‌ నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. విడతల వారీగా నిత్యం వేలాది మంది భక్తులు ఈ యాత్రకు బయల్దేరతారు. అయితే శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసి.. వరద పోటెత్తింది. క్షణాల్లోనే కొండల పై నుంచి భారీగా వరద ముంచెత్తింది. పెద్ద పెద్ద రాళ్లు, బురద కొట్టుకొచ్చాయి. దీంతో యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీయడంతో.. తొక్కిసలాట జరిగింది. అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. దీంతో అమర్‌ నాథ్‌ యాత్రను తాత్కాలికంగా.. నిలిపివేశారు. వరదల వల్ల ఇబ్బందులు పడకుండా జమ్ముకశ్మీర్‌ అధికార యంత్రాంగం ప్రత్యేక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శ్రీ అమర్‌ నాథ్‌ క్షేత్రం బోర్డుతో కలిసి విపత్తుకు సంబంధించిన సమాచారం అందించేందుకు 4 హెల్ప్‌ లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వాతావరణం బాగోలేదని మూడ్రోజుల క్రితం యాత్రను నిలిపివేశారు. వాతావరణం మెరుగుపడటంతో.. ఒక్క రోజులోనే యాత్ర తిరిగి ప్రారంభించారు. జమ్ము`కశ్మీర్‌ పరిధిలోని హెల్త్‌ సిబ్బందికి లీవ్స్‌ క్యాన్సిల్‌ చేశారు. సెలవుల్లో ఉన్నా…. వెంటనే డ్యూటీల్లో చేరాలని… అందరూ ఆఫీసర్లు ఫోన్లలో అందుబాటులో ఉండాలని చెప్పారు అధికారులు. జనం ఆశీర్వాదంతో ప్రమాదం నుంచి బయటపడ్డానని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి కేవలం ఒక్క కిలోవిూటర్‌ దూరంలో మాత్రమే ఉన్నామని చెప్పారు. చూస్తుండగానే వరదతో టెంట్లు అన్నీ కొట్టుకుపోయాయన్నారు. తన జీవితంలో అలాంటి వరద చూడలేదన్నారు. జనాన్ని సైన్యం రెస్క్యూ చేసిందన్నారు. ప్రాణహాని తక్కువ ఉందంటే జవాన్లు చేసిన సహాయ చర్యలే అన్నారు. రెండు రోజుల ముందే యాత్రకు వెళ్లాం. ఆన్‌లైన్‌లో హెలికాప్టర్‌ సర్వీసులు బుక్‌ చేశాం. గురువారం హెలికాప్టర్‌లో అమర్‌నాథ్‌కు చేరుకున్నాం. శుక్రవారం మాకంటే ముందు 10 వేల మంది దర్శనం చేసుకున్నారు. దర్శనానికి మాకు 3, 4 గంటలు పట్టింది. అప్పటికే అక్కడ వాతావరణం మారిపోయింది. దీంతో చాపర్‌ ఎక్కలేదు. గుర్రాల సాయంతో అక్కడి నుంచి
బయల్దేరాం. అమర్‌నాథ్‌ గుహ దాటి ఒక కిలోవిూటర్‌ దూరం వెళ్లాం. భారీ వర్షం కురవడం, వరద రావడంతో టెంట్లలో ఉన్న 20 ` 30 మంది తన కండ్ల ఎదుటే కొట్టుకుపోయారని ఎమ్మెల్యే అన్నారు.