అమిత్‌షా చాలాసార్లు ఫోన్‌ చేశారు

– ఉద్ధవ్‌ ఠాక్రే పోన్‌ ఎత్తలేదు
– శివసేన సీనియర్‌ నేత వెల్లడి
ముంబయి, జులై21(జ‌నం సాక్షి) : అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నో సార్లు ఫోన్‌ చేశారని, కానీ ఉద్ధవ్‌ ఠాక్రే ఫోన్‌ ఎత్తలేదని శివసేన పార్టీకి చెందిన సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. ‘లోక్‌సభలో అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ముందు రోజు అమిత్‌ షా పలుమార్లు ఫోన్‌ చేశారు. దాదాపు అయిదు సార్లు కాల్‌ చేశారు. ఒకసారి పార్లమెంటరీ కమిటీ కార్యాలయం నుంచి కూడా ఫోన్‌ వచ్చింది. కానీ ఏ కాల్‌నూ ఉద్ధవ్‌ రిసీవ్‌ చేసుకోవలేదు అని వెల్లడించారు. అయితే రెండ్రోజుల క్రితం అమిత్‌షా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌కు ఫోన్‌ చేశారని.. మద్దతు ఇవ్వాలని కోరగా, ఆయన అంగీకరించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే భాజపా మాత్రం తాము శివసేనతో మాట్లాడి ఓటింగ్‌కు మద్దతిచ్చేలా ఒప్పించామని చెప్తోంది. దీనిని శివసేన ఖండిస్తోంది. తాము అసలు భాజపా నేతలతో మాట్లాడలేదని, మద్దతు ఇస్తామని హావిూలు ఇవ్వలేదని తెలిపింది. భాజపాకు సుదీర్ఘ మిత్రపక్షం, ఎన్డీయే కూటమిలోని పార్టీ అయిన శివసేన శుక్రవారం లోక్‌సభకు హాజరుకాకపోవడం భాజపాకు ఇబ్బందికరంగా మారింది. ఈ మధ్య కాలంలో శివసేన తరచూ భాజపాను వ్యతిరేకిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగాన్ని  శివసేన ప్రశంసించింది. సభలో రాహుల్‌ మోదీని ఆలింగనం చేసుకోవడాన్ని కూడా మెచ్చుకుంది. ఈ చర్యను స్పీకర్‌ సహా భాజపా ఖండించిన సంగతి తెలిసిందే. శివసేన చర్యలతో.. 2019 సాధారణ ఎన్నికల్లో భాజపాతో కలిసి కాకుండా విడిగా పోటీ చేయనున్నట్లు మరోసారి స్పష్టంచేసింది. గతంలో కూడా శివసేన పలుమార్లు తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.