అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే…
– ట్రంప్ సంచలన వాఖ్యలు
న్యూఢిల్లీ ,అక్టోబర్ 14(జనంసాక్షి): రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అద్యక్ష ఎన్నికల ప్రచారంలో హెచ్1బి వీసాలు, ఔట్‌సోర్సింగ్ ప్రధానాంశాలుగా మారాయి. విదేశాల నుంచి వర్క్ వీసాల విూద తక్కువ వేతనానికి వచ్చే కార్మికులను అమెరికా కంపెనీలు తీసుకొస్తున్నాయని, తాను అధ్యక్షుడినైతే ఈ ఉద్యోగాలను అమెరికన్ల కోసమే కేటాయిస్తానని చెప్తున్నారు.సిన్సినాటీలో గురువారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతూ మన దేశంలో అనేకమంది తల్లులు తమ బిడ్డలకు ఉద్యోగాలు దొరకవని ఆందోళన చెందుతున్నారన్నారు. ఆ విధంగా ఆందోళన చెందే హక్కు వారికి ఉందన్నారు. మనకు ఎదురవుతున్న ముప్పుల్లో ఒకటి ఔట్‌సోర్సింగ్ అన్నారు. కాలేజీ విద్య సంపాదించినవారి ఉద్యోగాలను విదేశాలకు పంపించేస్తున్నారన్నారు. అదే సమయంలో కంపెనీలు తక్కువ వేతనాలు చెల్లించి, హెచ్1బీ వీసాలపై విదేశీయులను దిగుమతి చేసుకుంటున్నాయని చెప్పారు. అమెరికాలో ఉన్న కళాశాల విద్యావంతుల నుంచి ఉద్యోగాలను లాక్కుంటున్నాయని చెప్పారు.హెచ్1బీ వర్క్ వీసాలు ఐటీ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించే గొప్ప సాధనాలు, ముఖ్యంగా భారతీయులు వీటిపట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే భారతీయ విద్యావంతులకు అమెరికాలో ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.