అమ్మానాన్నలను పట్టించుకోని.. 

ప్రభుత్వోద్యోగుల వేతనాల్లో కోత!
– ఉత్తర్వులు జారీ చేసిన అసోం ప్రభుత్వం
గౌహతి, జులై28(జ‌నం సాక్షి) : తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో కోత విధించాలని అసోం ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లు, వచ్చే అక్టోబరు 2 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. తమపై ఆధారపడ్డ తల్లిదండ్రులు, దివ్యాంగులైన తోబుట్టువులను పట్టించుకోకపోతే ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తారు. ఎలాంటి ఆదాయ మార్గాలు లేని తల్లిదండ్రులు, దివ్యాంగులైన తోబుట్టువుల సంరక్షణకు ఒప్పుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత విధించి ఆ మొత్తాన్ని వారికి అందజేస్తామని అసోం ఆర్థిక మంత్రి హేమంత్‌ బిశ్వ శర్మ వెల్లడించారు. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతానాల్లో కోత విధించడం దేశంలో ఇదే తొలిసారి. ఇందు కోసం అక్కడ బీజేపీ ప్రభుత్వం అసోం ఉద్యోగుల తల్లిదండ్రుల బాధ్యత, జవాబుదారీ పర్యవేక్షణ చట్టం 2017కు గత సెప్టెంబరులోనే శాసనసభ ఆమోదం తెలిపింది. ‘ప్రాణం’ పేరుతో రూపొందించిన ఈ చట్టంలో నిబంధనలకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ నిబంధనలు వచ్చే అక్టోబరు 2 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం అమ్మానాన్నలు, దివ్యాంగులైన తోబుట్టువులను పట్టించుకోని ఉద్యోగులు వేతనాల్లో 10 నుంచి 15 శాతం కోత విధించి వారికి అందజేయనున్నారు. ప్రాణం చట్టం ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోదు కానీ, నిరాదరణకు గురైన వారి తల్లిదండ్రులు, తోబుట్టువులకు ఆసరా కల్పిస్తుంది. దీని మాదిరిగానే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ప్రయివేటు ఉద్యోగులకు వర్తించేలా మరో బిల్లును తీసుకొచ్చే ఆలోచనలో అసోం ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని విపక్షలు తప్పుబడుతున్నాయి. ప్రాణం చట్టం అస్సావిూ సమాజాన్ని కించపరిచేలా ఉందని మాజీ సీఎం తరుణ్‌ గోగాయ్‌ వ్యాఖ్యానించారు.