అయోధ్యలో చురుకుగా రామలయ నిర్మాణం
గర్భగుడి పనులకు సిఎం యోగి శంకుస్థాపన
2023 డిసెంబర్‌లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తి
లక్నో,జూన్1(జనంసాక్షి): అయోధ్య రామాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం గర్భగుడి సంబంధించిన పనులకు ఉత్తర్‌ప్రదేశ్‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు 2023 డిసెంబర్ కల్లా ఈ పనులు పూర్తవుతాయని కమిటీ అంచనా వేస్తోంది. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా.. రామాలయం నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లను సత్కరించారు. దేశవ్యాప్తంగా మునులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు అయోధ్య హనుమాన్ గఢీ ఆలయంలో యోగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2023 డిసెంబర్‌లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తవుతాయని రామాలయ పనులు చూసుకుంటున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆశాభావం వ్యక్తం చేసింది.2024లోగా ఆలయ నిర్మాణం, 2025లోగా ఆలయ సముదాయంలోని ఇతర నిర్మాణాలు పూర్తవుతాయని రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వేద మంత్రాల మధ్య ఆలయానికి పునాది రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లోగా దీనిని పూర్తి చేయాలన్న సంకల్పం కనిపిస్తోంది.