అరకుకు చేరుకున్న బస్సుయాత్ర
మంగళహారతులతో స్వాగతించిన మహిళలు
విశాఖపట్టణం,సెప్టెంబర్4(జనం సాక్షి): అనంతపురం నుంచి ప్రారంభమైన పశ్చిమ ప్రాంత సిపిఎం-సిపిఐ బస్సు యాత్ర మంగళవారం తిరుపతిలో దిగ్విజయంగా యాత్ర పూర్తిచేసుకొని మధ్యాహ్నం అరకులో ప్రవేశించింది. అరకు గిరిజన మహిళలు నాయకులకు మంగళహారతులతో సాదర స్వాగతం పలికారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో నేతలను ఘనంగా ఆహ్వానించారు. గిరిజన యువతీయువకులు నృత్యాలతోఅలరించారు. గిరిజన మహిళలు నాయకులతో కలిసి నాట్యమాడారు. పుష్పగుచ్ఛాలతో, పూలమాలలతో, గిరిజన సాంప్రదాయ టోపీలతో నాయకులకు స్వాగతాలు పలికారు. సంభ్రమ సంబరాలతో అరకు గిరిజనులు నేతలను ఘనంగా ఆహ్వానించారు. నాయకులు విజయఢంకా మోగించారు. అనంతరం అరకు సభలో నాయకులు ప్రసంగించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. అరకులో అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు జరిపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో గిరిజనులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.