అరుణాచల్, అక్సాయిచిన్ మావేనంటూ మళ్లీ చైనా కవ్వింపు!
బీజింగ్: చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh), ఆక్సాయ్ చిన్ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్ మ్యాప్‌ను (Standard Map) రూపొందించింది. చైనా న్యాచురల్ రిసోర్సేస్ రూపొందించిన ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా (South Tibet) పేర్కొంది. ఇక 1962 వరకు కశ్మీర్‌లో భాగంగా ఉన్న అక్సాయ్ చిన్‌ను డ్రాగన్ దేశం ఆక్రమించుకున్నది. అప్పటి నుంచి ఈ భూభాగంపై భారత్, చైనాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.ఇక తైవాన్ (Taiwan), దక్షిణ చైనా సముద్రాలను (South China sea) కూడా చైనాలో భాగమేనని నూతన మ్యాచ్‌లో పేర్కొంది. దక్షిణ చైనా సముంద్రంలో అతిపెద్ద భాగంగా ఉన్న నైన్ డ్యాష్ లైన్‌ను (Nine-dash line) కూడా తమ ప్రాంతంగా చూపించుకున్నది. అయితే దీనిపై వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై దేశాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.కాగా, బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సరిహద్దు వివాదం సహా ద్వైపాక్షిక అంశాలపై సంప్రదింపులు జరిగాయని బీజింగ్ అధికారిక ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్-చైనా సంబంధాల మెరుగుపడితే ఇరు దేశాలతో పాటు ప్రజల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరతాయని జిన్‌పింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రపంచంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి, శాంతి, సుస్ధిరతకు ఇండో-చైనా సంబంధాల బలోపేతం మార్గం సుగమం చేస్తుందని అన్నారు. సరిహద్దు ప్రాంతంలో శాంతిని కాపాడేందుకు ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు సమస్యను సరైన రీతిలో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీతో జిన్‌పింగ్ స్పష్టం చేసినట్టు చైనా తెలిపింది.
దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగామోదీ,జిన్‌పింగ్ ముచ్చటించుకున్నారని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ చెప్పారు. భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో అపరిష్కృత అంశాలపై ఈ సందర్భంగా జిన్‌పింగ్‌తో ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కాగా, వారిద్దరిమధ్య చర్చలు జరిగి వారం కూడా గడవకవముందే అరుణాచల్, ఆక్సాయ్ చిన్ భూభాగాలు తమవేనంటూ చైనా మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం.