అరెస్టు.. నిరసనల మధ్య తెలంగాణలోకి బాబు
భారీగా పోలీసు రక్షణ.. రాజోళి-సుంకేసుల మధ్య యుద్ధ వాతావరణం
మూడు వేల మంది పోలీసులు.. వందలాది ప్రైవేటు సైన్యంతో
తెలంగాణలో బాబు దండయాత్ర ఆరంభం
మహబూబ్‌నగర్, అక్టోబర్ 22 (జనంసాక్షి): భారీ నిరసనలు..జేఏసీ నేతల అరెస్ట్‌లు వేలాది మంది పోలీసులు..వందలాది ప్రైవేటు సైన్యం వెరసి తెలంగాణలో బాబు దండయాత్ర సోమవారం ప్రారంభమైంది..తెలంగాణపై తన వైఖరి తేల్చకుండా బాబు తెలంగాణలో అడుగు పెడితే నిరసనలు తెలుపుతం అంటూ హెచ్చరిం చడంతో తెలగుదేశం నేతలు గజగ జవణికిండ్రు.. అందుకే మూడు వేల మంది పోలీసులు బాబుకు భద్రత ఇస్తున్నా, బాబుకు రక్షణ అంటూ వందలాదిగా కిరాయి ప్రైవేటు సైన్యాన్ని వెంటబెట్టుకొచ్చిండ్రు..మహబూబ్‌నగర్ జిల్లా ఖాకీ వనంగా మారింది..జిల్లా సరిహద్దుల్లో యుద్దవాతావరణంకనబడింది..వీరందరి భద్రత మధ్య బాబు నిర్వహిస్తున్న పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లా రాజోలికి చేరుకోనున్నది. ఇదిలా ఉంటే తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే తెలంగాణలోకి అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తూ జేఏసీ చలో రాజోలికి పిలుపునిచ్చింది..ఈ కార్యక్రమానికి తెలంగాణవాదులు పెద్ద ఎత్తున బయలు దేరి రావాలని కోరింది..అయితే దీనిని అడ్డుకొనేందుకు టీడీపీ చంద్రదండును సిద్ధం చేసింది..భారీ సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలను ‘తరలించింది’..ఓ వైపు పోలీసులు..మరో వైపు చంద్రదండు కార్యకర్తలు మొహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి..అయితే చలో రాజోలి కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు, ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటాయన్న అనుమానంతో భారీ ఎత్తున మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు మోహరించారు. చంద్రబాబుకు రక్షణగా 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తుఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేసి పలువురు తెలంగాణ వాదులను టీఆర్‌ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పాలమూరు జిల్లా జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డితో సహా రామకృష్ణారావు, పలువురి జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని అచ్చంపేట, అయిజ, నాగర్‌కర్నూలు, గద్వాల అలంపూర్, నారాయణపేట, వనపర్తి, జడ్చర్ల, తదితర ప్రాంతాలలో పలువురి తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి రాజోలికి బయలుదేరిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, స్వామిగౌడ్, దేవీ ప్రసాద్‌లను శాంతినగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజోలికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేదిలేదంటూ ఆయనను అరెస్టు చేశారు. బీచ్‌పల్లి సమీపంలో ఉన్న టోల్‌గేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని వాహనాలను తనిఖీలు చేస్తూ తెలంగాణవాదులను అనుమానం వస్తే వారిని వెంటనే వెనక్కుపంపారు. రాజోలి వెళుతున్న అన్ని మార్గాలపై పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రాజోలి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.రాజోలిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ శాసనసభ్యులు, ఎంపీలు ముందే అక్కడికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులనుకూడా పెద్ద మొత్తంలో అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినా తెలంగాణవాదులు భారీ సంఖ్యలో రాజోలికి చేరుకున్నారు.