అల్పపీడనంతో మళ్లీ జోరువానలు
మూడు జిల్లాల్లో ముంచెత్తిన వర్షం
మరోమారు పొంగుతున్న వాగులు వంకలు
అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
విజయవాడ,నవంబర్29(జనం సాక్షి): బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం విూద ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతోంది. దీని ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. రిజర్వాయర్ల ఎగువ ప్రాంతాల్లో నదులు, వాగులు పొంగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురిస్తున్నాయి. మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారుల హెచ్చరికల నేపథ్యంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ మూడు జిల్లాలనూ ఇటీవల వచ్చిన వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. దీని నుంచి కోలుకోకముందే మళ్లీ వర్షాలు గత రెండు రోజులుగా కొనసాగున్నాయి. ఇప్పటికే ఈ మూడు జిల్లాల్లోని రిజర్వాయర్లు, చెరువులు పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యానికి చేరుకున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నారు. సోమశిల జలాశయానికి 96 వేల క్యూసెక్కుల వరద నీరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు ద్వారా 1.16 లక్షల క్కూసెక్యులు పెన్నా నదికి విడుదల చేయడం జరిగింది. మరోవైపు పెన్నా వరద ఉధృతికి నది అంచున ఉండే కట్ట కోతకు గురవుతోంది. ఆదివారం రోజంతా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో సరాసరి వర్షపాతం 56.9 మిల్లీవిూటర్లగా నమోదైంది. ఆదివారం ఉదయం తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. అ త్యధికంగా బుచ్చిరెడ్డిపాలెంలో 142.2 మి.విూ, ఆత్మకూరులో 105.8 మి.విూ వర్షం కురిసింది. కొడవలూరు లో 97.2, సం గంలో 97, విడవలూరులో 96.6, నెల్లూరులో 94.4, కోవూరులో 93, అల్లూరులో 86.8, నాయుడుపేటలో 80.6, అనంత సాగరంలో 75, ఇందుకూరుపేటలో 73.2, దొరవారిసత్రంలో 67.2, పొదలకూరులో 66.2, పెళ్లకూరులో 62.2, బాలాయ పల్లిలో 60.4 మిల్లీవిూటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సీతారామపురంలో10.8 మి.విూ వర్షం కురిసింది. భారీవర్షాల కారణంగా పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టును, కెవిబిపురంలోని కాళంగి రిజర్వాయర్‌లను ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న, కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించారు. దిగువ ప్రాంతాలకు నీటిని వదలాలని ప్రాజెక్టు ఇంజినీర్లను ఆదేశించారు. వీటి పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడప జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కడప నగరంలోని మురుగు కాలువలు పొంగి ప్రవహించడంతో పలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వేకోడూరు మండలం బాలుప్లలె వద్ద కొండలపై నుంచి వస్తోన్న వరద నీరు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో, కడప`తిరుపతి మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ముందుజాగ్రత్తగా కోడూరు గుంజన నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వాగులు, వంకలు, చెరువుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 46 మండలాల్లో వర్షం కురిసింది. నెల్లూరులో కుండపోత వర్షం పడిరది. జిల్లాలోని ఇరిగేషన్, పంచాయతీరాజ్ చెరువులు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. దీంతో, ఏ క్షణం ఏమి జరుగుతుందోననే భయం ప్రజల్లో నెలకొంది. పెన్నా, స్వర్ణముఖి, పంబలేరు, కాళంగి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నాయుడుపేట, గూడూరు, నెల్లూరు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏ క్షణమైనా, చెరువులు, నదులకు గండ్లుపడే ప్రమాదం ఉండడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, కర్నూలులో చిరు జల్లులు పడుతున్నాయి.