అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష
ఆదిలాబాద్, అక్టోబర్ 26 : నవంబర్ 1న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించవలసిన కార్యక్రమాలపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ అశోక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలు జిల్లాలోని ప్రజలకు తెలిసే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పోలీసు గ్రౌండులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారికి ఆస్తుల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జెడి వ్యవసాయం, పిడి మెప్మా, జెడి పశు సంవర్ధక శాఖ, ఇడిఎస్‌సి కార్పొరేషన్, పిడి గృహనిర్మాణం, ఎస్‌ఈఆర్ డబ్ల్యూఎస్ తదితర శాఖలవారు ఆయా శాఖల అభివృద్ధిని తెలియజేయ వివరాలతో స్టాల్స్ ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ సుజాత శర్మ, డిఆర్‌డిఆర్‌వో మనోహర్, తహశీల్దార్ దత్తు, అదనపు పోలీసు ఎస్‌పి పనసారెడ్డి, శేఖర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కార్పోరేషన్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.