అవినీతికి దూరంగా మోడీ సర్కార్‌

రాఫెల్‌ మాత్రం వెన్నాడుతోంది

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ నాలుగేళ్లు పాలన ఎలా ఉన్నా అవినీతి రహితంగా సాగుతుందన్న పేరు వచ్చింది. అయితే తాజాగా రాఫెల్‌ వ్యవహారంలో మాత్రం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాగే అమిత్‌షా కుమారుడి వ్యాపారాలపైనా ఆరోపణలు వచ్చాయి. గత కాంగ్రెస్‌ పాలనతో పోల్చుకుంటే అవినీతిరహితంగా మోడీ పాలన సాగిందనే చెప్పాలి.రాఫెల్‌ వియంలో కాంగ్రెస్‌ ఇప్పుడు ఎదురుదాడికి దిగుతోంది. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ అదేపనిగా రాఫెల్‌ను ప్రయోగిస్తున్నారు. రాఫెల్‌ విమానాల తయారీ కాంట్రాక్టు యూపీఏ సర్కారు హెచ్‌ఏఎల్‌కు ఇచ్చింది. రాఫెల్‌ విమానాలు దేశంలోనే తయారైతే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన వేలాది మంది యువత డిజైన్లు రూపొందించేది. కానీ మోదీ ప్రభుత్వం రూ.58 వేల కోట్లతో 126 రాఫెల్‌ విమానాలు కొనుగోలు చేసే ఈ ఒప్పందాన్ని అనిల్‌ అంబానీ కంపెనీకి ఇచ్చి దేశ యువత ఉద్యోగాలు లాక్కొంది. దేశంలో గత 70 ఏళ్లుగా సుఖోయ్‌, మిగ్‌, జాగ్వార్‌ లాంటి విమానాలు హెచ్‌ఏఎల్‌ తయారు చేస్తోంది. కానీ దేశప్రధాని ప్రతినిధి బృందంలో అనిల్‌ అంబానీ వెళ్తారు. ఫ్రాన్స్‌కి వెళ్లగానే ఒప్పందాలు మారిపోతాయి. హెచ్‌ఏఎల్‌ నుంచి ఆ కాంట్రాక్టులను లాక్కుని అనిల్‌కు ఇస్తారు. ఈ ప్రధాని మిత్రుడు ఎన్నడూ ఒక్క విమానం తయారు చేయలేదు. బ్యాంకులకు రూ.45 వేల కోట్లు ఎగ్గొట్టిన (డీఫాల్ట్‌) వ్యాపారవేత్త. ఈ ఒప్పందం జరగడానికి కేవలం 10 రోజుల ముందే ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. దేశప్రజల గురించి కొన్న రాఫెల్‌ విమానాల ధర గురించి ప్రజలకు చెప్పబోమని రక్షణ మంత్రి అంటారు. ఫ్రాన్స్‌తో రహస్య ఒప్పందమని చెబుతారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినపుడు ఇదే విషయంఅడిగితే ఎవరికైనా చెప్పవచ్చన్నారు. ఇప్పుడీ విషయాలను రాహుల్‌ పదేపదే వల్లె వేస్తున్నారు. దీనికి సకారాత్మకంగా సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ప్రధాని మోడీపై ఉంది. అయితే అవినీతి లేకున్నా అక్రమ రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. ఈ నాలుగేళ్లూ అవినీతి మరక అంటకుండా మోదీ దేశాన్ని పాలించారన్న ప్రశంసలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ తరహా రాజకీయాలకు పెద్ద ఎత్తున తెరతీసారు. తనవైపు వేలెత్తి చూపే అవకాశం లేకుండా మోదీ జాగ్రత్తగా వ్యవహరించారు. తన వ్యక్తిగత ప్రతిస్టను పెంచుకునేలా చేసుకున్నారు. అయితే పాలనలో మాత్రం అంతగా దూసుకుని పోవడం లేదు. ప్రధానంగా నోట్లరద్దు, జిఎస్టీతో ప్రజలకున్న ఆశలు అడియాశలయ్యాయి. గోవా, మణిపూర్‌, తదితర రాష్ట్రాల్లో రాజకీయ పెత్తనం సాగింది. బిహార్‌లో, గుజరాత్‌లో జరిగిన పరిణామాల వల్ల ప్రధాని మోదీ నైతికత, నిబద్ధత ప్రశ్నార్థకంగా మారాయి. కాంగ్రెస్‌ విముక్త భారత్‌ లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలు ఒక్కోసారి వెగటుగా ఉంటాయనడానికి ఇటీవలి పరిణామాలు ఉదాహరణగా చెప్పుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసే క్రమంలో చేస్తున్న పనులన్నీ దేశహితం కోసమేనని సరిపెట్టుకోలేం. అలాగే గతంలో విూరు చేయలేదా అని ఎదురుదాడి చేయడం ఇటీవల అలవాటయ్యింది. భారతీయ జనతా పార్టీ విస్తరణ కాంక్ష మోదీ, షాలను నిలవనివ్వడం లేదు. ఈ క్రమంలోనే తప్పటడుగులు వేస్తున్నారు. దేశమంతటా అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీ పతాకం రెపరెపలాడాలన్నది ఈ ఇరువురి నాయకుల కోరిక! ఈ కారణంగానే ఇప్పుడు దక్షిణాదిపై దృష్టిపెట్టారు. తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వాన్ని బుట్టలో వేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు నీతి వాక్యాలు వల్లె వేస్తోంది గానీ దేశ రాజకీయాలు ఇవ్వాళ ఇంతలా భ్రష్టుపట్టిపోవడానికి ఆ పార్టీనే ప్రధాన కారణం. గతంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా అనేక అడ్డదారులు తొక్కింది. రాష్ట్రాలలో అధికారం నిలబెట్టుకోవడం కోసం లేదా అధికారంలో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడం కోసం కాంగ్రెస్‌ పార్టీ చేయని అరాచకం లేదు.ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపైకి ఇంటెలిజెన్స్‌ బ్యూరో వంటి సంస్థలను ప్రయోగించి నానా ఇబ్బందులు పెట్టారు. సీబీఐ ద్వారా విచారణలు జరిపించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అడుగుజాడలలో అదే నరేంద్ర మోదీ, అవే ఏజెన్సీలను కాంగ్రెస్‌ నాయకుల విూదకు ప్రయోగిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో గానీ, ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంలో గానీ కాంగ్రెస్‌ ఎప్పుడూ ముందుండేది. ఇప్పుడు అదే పంథాను బిజెపి అనుసరిస్తోంది. దీనిని విమర్శించడం ద్వారా గత పదేళ్ల పాపాలనకు కాంగ్రెస్‌ కడిగి పారేసుకోలేదు.