అవినీతికి పాల్పడితే ఉపేక్షించం
నగర మేయర్ మహమ్మద్ వసీం హెచ్చరిక
అనంతపురం,నవంబర్29 ( జనంసాక్షి) ): పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించబోమని నగర మేయర్ మహమ్మద్ వసీం హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్త కోడిగుడ్లు ఇవ్వడం లేదని అవుట్ రిచ్ పోగ్రామ్ లో మేయర్ వసీం దృష్టికి స్థానికులు తీసుకురాగా వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బంది ని మేయర్ వసీం ఆదేశించారు. నగరంలోని 26వ డివిజన్ పరిధిలోని 44వ సచివాలయం హమాలి కాలనీలో సోమవారం సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాంలో మేయర్ వసీం డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య,కోగటం విజయభాస్కరరెడ్డిలతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్న తీరుపై స్థానికుల నుండి మేయర్ వసీం అరా తీయగా స్థానిక అంగన్వాడీ కార్యకర్త కోడిగుడ్డు నెలకు 9 మాత్రమే ఇస్తోందని ఇదేమని ప్రశ్నిస్తే చెడిపోయిన గుడ్లు వస్తున్నాయని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తోందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ సంబంధిత అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ రమణా రెడ్డిని ఆదేశించారు.కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి ,కార్పొరేటర్లు విూనాక్షి , అనిల్ కుమార్ రెడ్డి , కమల్ భూషన్, వైఎస్‌ఆర్ సిపి నాయకులు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.