అసంతృప్తులకు బాబు బుజ్జగింపు

పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని హితవు

రాహుల్‌తో కలసి ప్రచారంలో పాల్గొననున్న బాబు

అమరావతి,నవంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణలో టికెట్‌ ఆశించి భంగపడ్డ టీటీడీపీ నేతలు తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అమరావతిలో కలిశారు. అసంతృప్తితో ఉన్న ఆ నేతలను చంద్రబాబు బుజ్జగించారు. పొత్తుల కారణంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందని వివరించారు. కూటమి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని చంద్రబాబు వారికి హావిూ ఇచ్చారు. చంద్రబాబు హావిూతో సంతృప్తి చెందిన టీటీడీపీ నేతలు.. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు. ఇకపోతే తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగియడంతో తెదేపా అధినేత చంద్రబాబు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. టికెట్‌ ఆశించి భంగపడిన తెలుగు తమ్ముళ్లను బుజ్జగిస్తూ.. వారి భవితకు భరోసా ఇస్తున్నారు. మహాకూటమి అభ్యర్థులకు మద్దతుగా పనిచేసేలా ఒప్పించారు. ఈనెల 29, 30 తేదీల్లో

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయస్థాయిలో భాజపాయేతర కూటమి ఏర్పాటు కోసం వివిధ పక్షాల నేతలను కలిసి మద్దతు కూడగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులతో పాటు మహాకూటమి గెలుపుకోసం ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌, తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దించింది. ఇప్పటికే కూటమిలోని పార్టీలు ప్రచారం ¬రెత్తిస్తున్నప్పటికీ.. చంద్రబాబు ప్రచారంతో మరింత ఊపు వస్తుందని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. రాహుల్‌ పాల్గొనే ప్రచార సభల్లో చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఇద్దరు కలిసి రెండు సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్‌ సభల తర్వాత లేదా అంతకుముందే పార్టీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. వీలైనన్ని ఎక్కువ రోడ్‌ షోలు నిర్వహించేలా పార్టీ నేతలు షెడ్యూల్‌ రూపొందించారు. సోనియా కూడా తెలంగాణలో ప్రచారం చేయనున్నప్పటికీ చంద్రబాబు ఆ సభల్లో పాల్గొనరని సమాచారం.