అసెంబ్లీకి ఎవరు గైర్హాజరు కావద్దు
– అందరూ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలి
– ప్రతిపక్షం విధ్వంసక ధోరణితో వ్యవహరిస్తోంది
– ప్రధాని ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదు
– దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకత ప్రబలంగా ఉంది
– వసంత నాగేశ్వరరావు ఫోన్ బెదిరింపులపై చంద్రబాబు ఆగ్రహం
– బెదిరింపులతో రాజకీయాలు చేయలేరు
– అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యుల టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్10(జనంసాక్షి) : అసెంబ్లీ సమావేశాలకు ఎవరూ గైర్హాజరు కావొద్దని, చర్చలో అందరూ పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. క్వశ్చన్ అవర్ సీరియస్‌గా జరగాలన్నారు. అనుబంధ ప్రశ్నలతో సమగ్ర చర్చ జరిగేలా చూడాలని సీఎం తెలిపారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నారు. ప్రతిపక్షం లేదు కాబట్టి ఏదో ఒక సమాధానం ఇచ్చి వెళ్లిపోవడం కాదని, ప్రజలకే తాము జవాబుదారీ అనేది గుర్తుంచుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్షం విధ్వంసక ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షం లేనందున సభ అర్ధవంతంగా జరుగుతోందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మనమే ముందున్నామని, ఈజ్ ఆఫ్ గివింగ్ సిటిజన్ సర్వీసెస్‌లోనూ మనమే ముందుండాలని చంద్రబాబు అన్నారు. ఏపీ విభజన చట్టం అమలుపై కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని సీఎం విమర్శించారు. అప్పటి ప్రధాని ఇచ్చిన హావిూలు నెరవేర్చలేదని, ఇప్పటి ప్రధాని ఇచ్చిన వాగ్దానాలు అమలుకాలేదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత ప్రబలంగా ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారని, దీంతో నిత్యావసర ధరలు మరింత పెరుగుతాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు అవినీతిపై యుద్ధం అన్నారని, ఇప్పుడేమో అవినీతిపరులతో అంటకాగుతున్నారని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
బెదిరింపులతో రాజకీయాలు చేయలేరు..
పంచాయతీ సెక్రటరీకి ఫోన్‌చేసి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు బెదిరింపుల వ్యవహారంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులతో రాజకీయాలు చేయలేరని బాబు అన్నారు. వసంత నాగేశ్వరరావు బెదిరింపుల వ్యవహారం ప్రస్తావనకు రాగా.. ఆయన గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి బెదిరింపుల అంశాన్ని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బెదిరింపులతో రాజకీయాలు చేయలేరన్నారు చంద్రబాబు పేర్కొన్నారు. బెదిరింపులు పాల్పడి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తూ ఊరుకొనేది లేదని బాబు హెచ్చరించారు. గత ఎన్నికల ముందు కూడా వైసీపీ ఇదే తరహాలో వ్యవహరించారని సీఎంకు తెలిపిన సీనియర్ నేతలు… వసంత నాగేశ్వరరావు వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదైందని తెలిపారు.