అసెంబ్లీ కమిటీ హాల్లో గురుపూజోత్సవం

నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు

అధికారులతో సవిూక్షించిన స్పీకర్‌, మండలి ఛైర్మన్‌

ఈ సమావేశాలకు కూడా వైకాపా హాజరు కానట్లే

అమరావతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఏపీ శాసనసభ సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ కమిటీ హాల్లో గురుపూజోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, శాసనమండలి చైర్మన్‌ ఎన్‌ఎండి ఫరూక్‌ నివాళులర్పించారు. మరోవైపు గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్పీకర్‌ కోడెల, మండలి చైర్మన్‌ ఫరూక్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు. 10-15 రోజుల పాటు నిర్వహించే ఈ సభలో కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న టిడిపి ఈ సమావేశాలను చక్కగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ…శాసన మండలి వేదికగా కేంద్రం..ప్రతిపక్షాలపై దాడికి సిద్ధమౌతోంది. ఏపీపై కేంద్రం చూపిస్తున్న వివక్ష, అభివృద్ధికి సహకరించకపోవడం తదితర అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ కూడా టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తోంది. ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఈసారి సమావేశాలకు హాజరవుతుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. గతంలో లాగానే సమావేశాలను బహిష్కరిస్తామని ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పారు. ఈ సమావేశాలకు కూడా హాజరు కావద్దని వైసీపీ అధినేత జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజా సమస్యలపై చర్చించి..పరిష్కరిస్తారని ఎన్నుకుంటే అసెంబ్లీకి గైర్హాజర్‌ అవుతుండడంపై వైసీపీ తీవ్ర విమర్శలు పెల్లుబికుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని…మంత్రులుగా బాధ్యతలు తీసుకొన్న నలుగురిని భర్తరప్‌ చేయాలని….టిడిపిలో చేరిన 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయాలని వైసీపీ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై టిడిపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైసీపీ అధినేత జగన్‌ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరిగే సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని సూచిస్తారా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1989 నుండి 1994 మధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు తాను హజరు కాబోనని అప్పటి విపక్ష నేత ఎన్టీఆర్‌ పేర్కొని సమావేశాలకు హజరు కాలేదు. ప్రస్తుతం వైసీపీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కానీ ప్రజా సమస్యలను పరిష్కరించాలని…అత్యున్నతమైన సభకు ఎమ్మెల్యేలను పంపిస్తే వారు సమావేశాలకు హాజరు కాకపోవడంపై వ్యతిరేక అభిప్రాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ బహిష్కరణనను జనసేన అధినేత పవన్‌ కూడా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

 

తాజావార్తలు