అసెంబ్లీ ముట్టడికి రైతుల పిలుపు

ముందుగానే నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు

అమరావతి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రాజధానిలో హైటెన్షన్‌ నెలకొంది. సోమవారం ఉదయం నుండే ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ముట్టడికి అసైన్డ్‌ భూముల రైతులు పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు రైతులను, సిపిఎం, సిపిఐ నాయకులను అరెస్టులు చేశారు. పలువురిని గృహ నిర్బంధం చేశారు. సిపిఎం కమిటి సభ్యులు వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెల్లీ విల్సన్‌, సిపిఎం , సిపిఐ రాజధాని కార్యదర్వి రవిలను అరెస్టు చేసి, తుళ్లూరు స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌ ల ముందే రైతులు బైఠాయించి ధర్నా చేశారు. అసైన్డ్‌ భూముల రైతులు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్‌ భూముల రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. అసైన్డ్‌ భూముల రైతులకు కూడా పట్టా భూములతో పాటు సమాన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతు కూలీలకు ఒక్కొక్కరికి నెలకు 9 వేల రూపాయల పింఛన్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. సోమవారం రైతులు అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నంలో ముందస్తుగా పోలీసులు అసైండ్‌ భూముల రైతుల్ని అరెస్టు చేశారు. రైతు సంఘాల నాయకులను హౌస్‌ అరెస్టు చేశారు. అరెస్టు చేసిన రైతుల్ని ఏ స్టేషనుకు తీసుకు వెళ్ళారో అర్ధం కాక కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అసెంబ్లీ చుట్టూ భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వెళ్ళే అన్ని మార్గాలలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకు వెళ్ళే వాహనాలతో పాటు, ఆర్టీసీ బస్సుల్ని కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

తాజావార్తలు