ఆంగ్ల మాధ్యమంపై టీచర్లకు శిక్షణ
విజయనగరం,డిసెంబర్18(జనంసాక్షి): గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుచేయడానికి ఆశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పురపాలకసంఘం యాజమాన్యంలోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని అమలుచేస్తుండగా, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా రూపొందించి అమలుచేస్తున్నారు. నిరంతరాయంగా శిక్షణలు కొనసాగించి ఉపాధ్యాయులను సన్నద్ధం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతీయేటా ఒక్కో తరగతిలో ఆంగ్లమాధ్యమ తరగతులు అమలుచేస్తూ ముందుకు వెళ్లాలనే ఆలోచనతో యంత్రాంగం ఉంది.ఇదిలావుంటే వచ్చే విద్యాసంవత్సరం నుంచి గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.చాలా కాలంగా ఈమేరకు ఉన్నతాధికారుల నుంచి ఐటీడీఏ అధికారులకు కచ్చితమైన సూచనలు జారీ అయినట్లుంది. అన్ని పాఠశాలల్లో ప్రత్యేకంగా వీటిని ప్రారంభించనున్నట్లు వెల్లడిరచారు. గతంలోనే గిరిజన సంక్షేమశాఖలో ఆంగ్లమాధ్యమం ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ విద్యార్థులు చదువులో వెనుకబడిపోతారని పలు సంఘాలు ఆంగ్లమాధ్యమాన్ని వ్యతిరేకించాయి. ఆంగ్లమాధ్యమంతో పాటుగా తెలుగు మాధ్యమం కూడా కొనసాగించాలని, ఎవరికి నచ్చిన మాధ్యమంలో వారు చదువుకొనే స్వేచ్ఛనుకల్పించాలని డిమాండు చేస్తూ వచ్చారు.