ఆందోళనకు సిద్ధమవుతున్న వామపక్షాలు
ఆదిలాబాద్, నవంబర్ 18: ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలపై వామ పక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేర నడుచుకోవడం లేదని సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసి నాయకులు రాఘవులు, దత్తాత్రి, అరుణ్‌కుమార్, నారాయణ దుయ్యబట్టారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మరోసారి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు 11 వామపక్షాలు సిద్ధమయ్యాయని వారు పేర్కొన్నారు. ఆందోళన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. ఈ సదస్సుల్లో విద్యుత్, సబ్‌ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, డిజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల తదితరపై ప్రజల్లో అవగాహన కల్పించి ఉద్యమిస్తామని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.