ఆందోళనలో బీడీ కార్మికులు
ఆదిలాబాద్, జూలై 28: జిల్లాలో మహిళలు బీడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించడంలో కార్మిక శాఖ కాని, ప్రజాప్రతినిధులు కాని పట్టించుకోకపోవడంతో బీడి కార్మికులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, బోర్టు, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో మహిళలు బీడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. సరైన పనిదినాలు లేక, సరైన వేతనాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వారి బ్రతుకులు ఆస్తవ్యస్తంగా మారాయి. దీనికితోడు బీడి కంపెనీ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కమిషన్ ఏజెంట్ల వ్యవహారంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కార్మిక చట్టాల ప్రకారం కనీస పని దినాలు కల్పించి వేతనాలు చెల్లించాల్సి ఉండగా, యాజమాన్యాలు కుంటి సాకులు చూపుతూ, చట్టాలను అమలు చేయకపోవడంతో కష్టపడి పనిచేస్తున్న పొట్ట గడవడానికి కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది కాలంగా తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలు పెంచాలని ఆందోళనలు చేపట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లాలో సుమారు 50 బీడి పరిశ్రమలు ఉండగా, లక్ష మందికిపైగా కార్మికులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. రోజంతా కష్టపడిన 100 నుంచి 120 వరకు వస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు రాకపోవడంతో వారి జీవనం కష్టమవుతోంది. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గోడు పట్టించుకొని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.