ఆందోళన కలిగిస్తున్న జికా వైరస్‌ వ్యాప్తి

51కి చేరిన వ్యాధిపీడితులు
జయపుర,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో జికా వైరస్‌ ప్రజలను వణికిస్తోంది. మరో 18 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జయపురలో జికా వైరస్‌ సోకిన వారి సంఖ్య 51కి చేరినట్లు కేంద్ర
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన జికా కేసుల్లో పది కేసులు జయపురలోని శాస్త్రినగర్‌ ప్రాంతంలో నమోదయ్యాయని అధికారులు తెలిపారు. జికా వైరస్‌ సోకిన వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబరు 22న జయపురలో తొలి కేసు నమోదైంది. జికా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో వైరస్‌ను అరికట్టేందుకు అధికారులు దోమలు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. గర్భిణీలు శాస్త్రినగర్‌ ప్రాంతంలో ఉండొద్దని, అక్కడికి వెళ్లొద్దని అధికారులు సూచించారు. జికా వైరస్‌కు సంబంధించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షించేందుకు జాతీయ విపత్తు నివారణ కేంద్రం కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసింది. వ్యాధి సోకిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జికా సోకిన వారిలో 11 మంది గర్భిణీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జికా వైరస్‌ ఇంకా ఎక్కువ మందికి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పర్యవేక్షణ బృందాలను 50 నుంచి 170కి పెంచారు. భారత్‌లో జికా వైరస్‌ తొలిసారిగా 2017లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బయటపడింది. తర్వాత తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ ఏడాది జులైలో ఓ వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు తెలిసింది. వీటిని విజయవంతంగా ఎదుర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల్లో జికా వైరస్‌ వ్యాపించింది. 2015లో బ్రెజిల్‌లో ఈ వైరస్‌ చాలా మందికి సోకి ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించింది.