ఆంధ్రాలో కులాలను రెచ్చగొడుతున్నారు


– కులరాజకీయాలు వస్తే ఏపీ నాశనమే
– తెలంగాణ గొడవలో ప్రజలు చితికిపోయారు
– విజన్‌ 2050 పేరుతో టీడీపీ ప్రజల్ని మోసం చేస్తోంది
– వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది జనసేననే
– జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
– జనసేన తీర్థం పుచ్చుకున్న రావెల కిషోర్‌బాబు
– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్‌ కళ్యాణ్‌
విజయవాడ, డిసెంబర్‌1(జ‌నంసాక్షి) : ఆంధ్రాలో కులాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, ఇలాంటి పరిణామాలతో రాష్ట్రం పూర్తిగా నాశనమవుతుందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు శనివారం విజయవాడలో  పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ రావెలకు పార్టీ కండువా
కప్పి సాదరంగా ఆహ్వానించారు. రావెలతో పాటూ మరికొందరు ముఖ్య నేతలు, అనుచరులు జనసేనలో చేరారు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. అవకాశవాద రాజకీయాలు పోయి.. ప్రజలకు సేవ చేయగలిగే రాజకీయ వ్యవస్థ రావాలని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కుల రాజకీయాలు వస్తే భవిష్యత్‌ దెబ్బతింటుందని.. రాష్ట్రంలో కులాల కుంపటి లేకుండా పోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా.. స్వచ్ఛ రాజకీయాలు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్‌ చెప్పారు. రావెల కిషోర్‌ బాబు రాజకీయ విలువల్ని పాటించడం అభినందనీయమన్నారు. చాలాపద్దతిగా ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చారన్నారు. దళితులకు పదవులు ఇస్తారు కాని, అధికారాలు మాత్రం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. దళితుల ఓట్లు మాత్రం కావాలా అంటూ మండిపడ్డారు. జనసేన మాత్రం కుల రాజకీయాలకు దూరమన్నారు. విజన్‌ 2050 పేరుతో టీడీపీ ప్రజల్ని మోసం చేస్తోందని.. ప్రకృతి వనరుల్ని అడ్డంగా దోచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతల తీరు మారాలన్నారు. ఆంధప్రదేశ్‌లో బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ తరహా కుల రాజకీయాలు వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. తద్వారా అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ గొడవల్లో ప్రజలు చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో ఓ రెండు కులాలను రెచ్చగొట్టి, మరో రెండు కులాలపై ఎగదోసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో ఆశాంతి తప్ప మరేది ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి కుల రాజకీయాలను అడ్డుకుంటారన్న ఉద్దేశంతోనే తాను 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. అయితే ఆ పార్టీ నేతలు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ఏమాత్రం మారలేదని విమర్శించారు. ఇసుక మాఫియా, మహిళలపైద దాడులతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మద్దతును కోల్పోయిందన్నారు. చంద్రబాబు జనసేన అభివృద్ధికి సాయం చేస్తారని తాను ఎప్పుడూ ఆశించలేదన్నారు.
రాష్ట్రంలో అవినీతిరహిత ప్రభుత్వం వస్తుందని మాత్రమే ఆశించానని వెల్లడించారు. అయితే రాష్ట్రమంతటా ఇప్పుడు తీవ్రమైన అశాంతి పరిస్థితులు, అవినీతి విలయతాండవం చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో విజన్‌ 2050 ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం
అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
బడుగు, బలహీన వర్గాలసంక్షేమానికి కృషి చేస్తా – రావెల
నవ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్‌తో కలిసి నడవాలనే ఉద్దేశంతో పార్టీలో చేరానని రావెల కిషోర్‌ బాబు అన్నారు. ప్రజాస్వామ్యం డబ్బు, కుల స్వామ్యంగా మారిందని.. కుల పట్టింపులు లేని సమాజం కోసం పవన్‌ నడుం బిగించారన్నారు. జనసేన ఉద్యమంలో భాగమై.. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో చంద్రబాబు మంత్రిగా అవకాశం కల్పించారని కిషోర్‌ బాబు అన్నారు. ప్రతినిత్యం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి తన వంతు కృషి చేశానని, రాజకీయంగా పదవులు ఇస్తారు కాని అధికారం మాత్రం ఇవ్వరంటూ టీడీపీపై పరోక్షంగా విమర్శలు చేశారు. అందుకే ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేయలేకే పార్టీ నుంచి బయటకు వచ్చానని కిషోర్‌ బాబు   తెలిపారు.