ఆక్వాతో కాలుష్యం అవుతున్న పొలాలు
ఆక్రమార్జనకు పాల్పడుతున్నారని మండిపాటు
ఏలూరు,జూలై25(జనంసాక్షి): ప్రజలందరికీ అన్నం పెట్టే పచ్చనిపొలాలను నాశనం చేసి చేపలు చెరువులు తవ్వితే సహించేది లేదని సిపిఎం జిల్లాకార్యదర్శి బలరామ్ హెచ్చరించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా వ్యవసాయరంగ అభివృద్ధి లేదని సర్వే గణాంకాలు తెలుపుతున్నాయి. అందుకు భిన్నంగా అధికార పార్టీ నాయకులే లంచాలు తీసుకుని పొలాలను నాశనం చేసి చెరువులును అధికారుల చేత అనుమతులు ఇప్పించేస్తూ ఆక్రమార్జనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీంతో పచ్చటి పశ్చిమ కాలుష్యకారకంగా మారుతుందని విమర్శించారు. పచ్చటి వరి పొలాలను చేపలు, రొయ్యల సాగు కోసం చెరువు తవ్వకాలకు అధికారులు అనుమతులిచ్చారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎపి రైతు సంఘం జిల్లా నాయకులు కూడా హెచ్చరించారు. ఆక్వా కాలుష్యంతో తాగునీరు దొరకని పరిస్థిలు దాపురించా యని, భవిష్యత్తు తరాలకు కాలుష్యరహిత జలాలను ఇవ్వాలంటే చెరువులు తవ్వకుండా కఠిన నిబంధన లను విధించాలని కోరారు. పొలాలను చెరువులుగా తవ్వితే ప్రాణత్యాగం చేసైనా అడ్డుకుంటామని వారు అన్నారు. ఇదిలావుంటే పెద్దనోట్ల రద్దు వల్ల వ్యవసాయానికి అప్పులు దొరక్క కౌలురైతులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో కౌలుసాగు సంక్షోభంలో పడిందని ఆంధప్రదేశ్ కౌలు రైతుల సంఘం నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. కౌలురైతులకు వడ్డీలేని పంట రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. భూఅధీకృత సాగుదారు చట్టం ప్రకారం ఇచ్చిన రుణార్హత కార్డులకు పంట రుణాలివ్వకుండా బ్యాంకర్లు వాటిని రుణ అనర్హత కార్డులుగా మార్చివేస్తున్నారని విమర్మించారు. కౌలురైతులకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. డెల్టా ప్రాంతంలో అక్రమంగా తవ్వతున్న చేపలు, రొయ్యల చెరువులను అరికట్టాలని, వరి సాగయ్యే భూములను కాపాడాలని కోరారు.