ఆగస్టులో తెలంగాణపై ప్రకటన చేయాలి
ఆదిలాబాద్, జూలై 25 : ఆగస్టు మాసంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే మలి విడత ఉద్యమం చేపడుతామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు బుధవారంనాటికి 934వ రోజుకు చేరుకున్నాయి. ప్రజల ఆకాంక్ష మేరకు ఎలాంటి కాలయాపన చేయకుండా, సాకులు చూపకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం మళ్లీ తెలంగాణ విషయమై వెనకడుగు వేస్తే తెలంగాణ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజా ఉద్యమంలో కలిసి రావాలని వారు అన్నారు. ఇప్పటికే ప్రజలు విసిగి పోయారని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మినహా ఇతర ప్యాకేజీలకు ఒప్పుకునే ప్రస్తే లేదని అన్నారు. కేంద్రం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయమై మళ్లీ వాయిదా వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.