ఆజ్మీర్‌ దర్గాను దర్శించుకున్న రాహుల్‌

అజ్మీర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సచిన్‌ పైలట్‌, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్గా వద్ద రాహుల్‌ జియారత్‌ నిర్వహించారు. ఆ తర్వాత పోక్రాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. తాము అధికారం చేపట్టకముందు దేశం నిద్రాణ అవస్థతలో ఉందని ప్రధాని మోదీ అంటున్నారని, ఈ దేశాన్ని నిర్మించిన వారిపట్ల ఇది అవమానకరమైన విషయమని రాహుల్‌ విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతులు గిట్టబాటు ధర అందిస్తామని, అవినీతిని అంతం చేస్తామని ప్రధాని మోదీ వాగ్ధానం చేశారని, కానీ ఆ వాగ్దానాల గురించి ఇప్పుడు ఆయన మాట్లాడడం లేదని రాహుల్‌ అన్నారు. ఉదయం రాహుల్‌.. పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్ని కూడా విజిట్‌ చేశారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.