ఆడపిల్లలను రక్షించుకోలేనందుకు.. 

సిగ్గుతో ఉరేసుకోవాలి
– హరియాణా అత్యాచార ఘటనపై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జులై21(జ‌నం సాక్షి) : హరియాణాకు చెందిన ఓ మహిళపై నలభై మంది వ్యక్తులు నాలుగురోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పంచకులలోని మోర్నీహిల్స్‌లో గల ఓ అతిథి గృహంలో నాలుగు రోజుల పాటు తనను నిర్బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. ఆడపిల్లలను కాపాడుకోలేని మన అసమర్థతకు సిగ్గుతో ఉరేసుకోవాలంటూ ట్విటర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘హరియాణాలో మహిళలపై 40 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నన్ను దిగ్భాంత్రికి గురి చేసింది. మహిళలపై రోజురోజుకీ పెరుగుతున్న అకృత్యాలను గురించి కొద్ది గంటల క్రితమే పార్లమెంటులో ప్రస్తావించాను. అంతలోనే ఈ ఘటన గురించి తెలిసింది. దేశ ఆడబిడ్డలను రక్షించుకోలేని అసమర్థతను చూసి సిగ్గుతో మనం ఉరివేసుకోవాలి’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. హరియాణాకు చెందిన 22ఏళ్ల యువతిపై కొందరు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అతిథి గృహంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిందితుల్లో ఒకడు తన భార్యను తీసుకువెళ్లాడని బాధితురాలి భర్త పేర్కొన్నారు. ‘నా భార్యకు మత్తు మందులు ఇస్తూ.. జులై 15 నుంచి 18 వరకు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. చివరికి ఆమె ఎలాగో ఫోన్‌ చేసి నాకు సమాచారం ఇచ్చింది. నేను పోలీసులకు చెబుతానని అనడంతో.. ఆమెను విడిచిపెట్టారు. విషయం పోలీసులకు చేరితే చంపేస్తామని బెదిరించారు అని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన జరిగిన అతిథి గృహం యజమాని సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.