ఆదిత్యుడిని తాకిన సూర్యకిరణాలు
భక్తుల పారవశ్యం
అరసవల్లి, అక్టోబర్1(జనంసాక్షి):: శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని సోమవారం ఉదయం సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఆదిత్యుని పాదాలను స్పృశించేందుకు భానుడు చేసిన ప్రయత్నానికి మేఘం అడ్డుపడినా స్వామి వారి ముఖానికి కిరణాలు తాకడంతో భక్తులు పరవశించిపోయారు. ప్రతీ ఏటా ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి మారే సందర్భంలో ఈ కిరణస్పర్శ మూలవిరాట్‌ను తాకడం ఆనవాయితీ. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా భక్తులను కనువిందు చేస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం కనిపిస్తుంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్టాల్ర నుంచి భక్తులు వస్తుంటారు. ప్రతీ సంవత్సరం మార్చి నెల 9, 10 తేదీల్లో.. అలాగే అక్టోబరు 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకుతాయి. ఈ దృశ్యాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కనులారా వీక్షించారు.