ఆదిలాబాద్‌లో అగ్ని ప్రమాదం
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్: ఆదిలాబాద్‌లోని తిరుపెల్లి కాలనీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపెల్లి కాలనీలోని పెంకుటింట్లో కిరాయి ఉంటున్న విజయలక్ష్మి రాత్రి 9 గంటల సమయంలో వంట చేయడానికి గ్యాస్‌స్టౌను వెలిగించింది. స్టౌ వెలిగించగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ,చెలరేగాయి. దీంతో బయటకు పరుగులు తీసింది. కొద్దిసేపటికే సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. కాలనీ మొత్తం పొగతో కమ్ముకుపోయింది.
ఇంట్లో ఉన్న మరోగ్యాస్ బుడ్డి కూడా పదిహేను నిమిషాల వ్యవధిలో పేలడంతో మంటలు మరింత ఎక్కువయ్యాయి. పెంకుటిళ్లు కావడంతో కాలిబూడిదైంది. వెంటనే స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే నష్టం జరిగిపోయింది. దాదాపు గంటపాటు ఫైర్ సిబ్బంది కష్టపడి మంటలు ఆర్పారు. వన్‌టౌన్ సీఐ రగ్యానాయక్, ఫైర్ ఆఫీసర్ అనిల్‌కుమార్, లీడింగ్ ఫైర్‌మెన్ కెఎస్ స్వామి సంఘటన స్థలానికి పరిస్థితి పరిశీలించారు.పళ్లి కోసం దాచి ఉంచిన డబ్బు బూడిద పాలు..
విజయలక్ష్మి కూతురు సుహాసిని పెళ్లి మరో నెల రోజుల్లో ఉంది. కూతురు పెళ్లి కోసం దాచుకున్న రూ.2లక్షల నగదు, 3 తులాల బంగారం, 40 తులాల వెండి మంటల్లో దగ్దమైపోయాయి. వీటితోపాటు ఇంట్లో ఉన్న టీవీ, ఫీజ్, కూలర్, బట్టలు ఆహుతయ్యాయి. కూతురు పెళ్లి ఎలా చేసేదెలా అంటూ విజయలక్ష్మి రోదించింది. తమను ఆదుకోవాలని వేడుకుంది. అదే ఇంట్లో వెనుకభాగాన కిరాయి ఉంటున్న మోహన్‌దాస్‌కు చెందిన రూ.లక్ష నగదు, ఇంటివస్తువులు కూడా కాలిబూడిదయ్యాయి.