ఆదివాసిల హక్కులను కాపాడండి
ఆదిలాబాద్, నవంబర్ 3: ఆదివాసి గిరిజనులకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సమయ్య అన్నారు. ఆదిలాబాద్‌లోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన ఆ సంఘం కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లంబాడీల వల్ల ఆదివాసి గిరిజనులకు రావాల్సిన హక్కులు రాకుండా పోతున్నాయని, వెంటనే ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసి నిరుద్యోగ యువకులకు అన్యాయం చేసే విధంగా తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందుతూ లంబాడీలు వారి ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఆదివాసి సంక్షేమానికి ఏర్పాటు చేసిన 1/17 చట్టాన్ని పగడ్బంధీగా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతంలో వివిధ వ్యాధులతో జరుగుతున్న మరణాలను అరికట్టేందుకు పగడ్బంధీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదివాసి గిరిజనులు హక్కుల సాధనకు, చట్టాల అమలుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు రామచంద్రారావు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.