ఆధార్‌తో విద్యుత్‌ వినియోగదారుడి సమాచారం లింక్‌

యాప్‌ ద్వారా విద్యుత్‌ సమాచారం

హైదరాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): విద్యుత్తు శాఖ సేవలను మరింత విస్తృతపరచడంతో పాటు నాణ్యమైన కరెంటు సరఫరా అందజేసేందుకు ఆధార్‌ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ప్రతి వినియోగదారుడి సమాచారం ట్రాన్స్‌కో యంత్రాంగం వద్ద ఉండబోతున్నది. విద్యుత్తుశాఖ తీసుకునే కీలకమైన నిర్ణయాలు వినియోగదారుడికి ఆన్‌లైన్‌లో సమాచారం అందుతుంది. ఇలా వినియోగదారులందరి నంబర్లను సేకరించి యాప్‌తో అనుసంధానం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ట్రాన్స్‌కో యంత్రాంగం ప్రచారం కూడా చేస్తున్నది. ట్రాన్స్‌కో ఆధార్‌ అనుసంధానంతో అక్రమాలకు చెక్‌పెట్టే యోచనలో ఉన్నది. ఇక నుంచి విద్యుత్తు వినియోగదారుల బకాయిలు, చెల్లింపులు విద్యుత్‌ సరఫరా నిలిపేవేసే సమాచారం, సరఫరాలో కలిగే అంతరాయం వంటి సమాచారాలను ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఆన్‌లైన్‌లో అందుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌కో ఒక యాప్‌ను తయారు చేసింది. ఉర్జామిత్ర అనే యాప్‌తో ట్రాన్స్‌కో వినియోగదారుల ఆధార్‌ నంబర్లను, మొ బైల్‌ నంబర్లను అనుసంధానం చేస్తారు. వ్యవసాయ, గృహ విద్యుత్తు కనెక్షన్లకు సంబంధించిన సమాచారం ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఇందులో భాగంగానే ట్రాన్స్‌కో సిబ్బంది బిల్లులను ఇండ్లకు వెళ్లి అందజేస్తున్న సమయంలో సంబంధిత వినియోగదారుల నుంచి ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ను సేకరిస్తున్నారు. ప్రతి విద్యుత్తు కనెక్షన్‌కు ఆధార్‌ లింకు ఉండడంతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి కనెక్షన్‌ సమాచారం ట్రాన్స్‌కో వద్ద ఆధార్‌ అనుసంధానమై ఉండబోతున్నందున అక్రమ కనెక్షన్లకు తావు లేకుండా పోయే అవకాశం ఉంది. అనేక మంది వినియోగదారులు తమ ఇంటి నంబర్లపై అప్పటికే ఒక విద్యుత్తు విూటర్‌ కలిగి ఉన్నప్పటికీ కొత్త విూటర్ల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి నంబర్లను తారుమారు చేసి కొత్త కనెక్షన్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒకే ఇంటికి రెండేసి కనెక్షన్లు ఉండడం ద్వారా విద్యు త్‌ బిల్లులను ఆదా చేసుకుంటూ ట్రాన్స్‌కోకు నష్టం చేకూర్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇక వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌సరఫరా చేస్తున్న తరుణంలో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ విద్యుత్తు కనెక్షన్లతో వ్యవసాయ పంపుసెట్లను నడుపుతున్నారు. దీనిని అరికట్టేలా చర్యలకు పూనుకుంటున్నారు.