ఆధార్‌ రాజ్యాంగ బద్ధమైనదే

– డేటా భద్రతపై అనుమానాలు అవసరం లేదు
– ఆధార్‌ అనేది జాతీయ గుర్తింపు కార్డు
– ప్రైవేట్‌ సంస్థలకు ఆధార్‌ డేటా ఇవ్వడం కుదరదు
– బ్యాంక్‌ సేవలకు ఆధార్‌ తప్పని సరికాదు
– టెలికాం కంపెనీలు ఆధార్‌ వివరాలు అడగవద్దు
– ఇప్పటివరకు సేకరించిన యూజర్ల ఆధార్‌ నెంబర్లను డిలీట్‌ చేయాలి
– పాన్‌, ఇన్‌కంట్యాక్స్‌లకు మాత్రం ఆధార్‌ తప్పని సరి
– ఆధార్‌పై దాఖలైన పిటీషన్‌లపై సంచలన తీర్పు వెలువరించిన సుప్రింకోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : ఆధార్‌ జాతీయ గుర్తింపు కార్డు అని, ఆధార్‌ డేటా భద్రతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరపగా.. జస్టిస్‌ ఏకే సిక్రి మెజార్టీ తీర్పును చదివి వినిపించారు. ఆధార్‌తో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు కార్డు లభించిందని, దాని వల్ల వారికి సాధికారిత వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రి అన్నారు. ఆధార్‌ కార్డు రాజ్యాంగబద్ధమైనదని స్పష్టంచేశారు.. ఆధార్‌తో నకిలీల సమస్య తొలిగిపోయిందని, మరోసారి ఆధార్‌ నమోదుకు వెళ్తే కంప్యూటర్‌ గుర్తిస్తుందని, ఇదే ఆధార్‌ను ప్రత్యేక గుర్తింపుగా చెప్పడానికి కారణం అని ఆయన పేర్కొన్నారు. ఆధార్‌ నమోదుకు ప్రజల నుంచి సాధ్యమైనంత కనీస సమాచారం మాత్రమే తీసుకున్నారని, ఇది పౌరులకు ఏకైక గుర్తింపు కార్డును అందజేసిందని సిక్రి వెల్లడించారు. ఆధార్‌ వల్ల వ్యక్తిగత గోప్యత, హ్యాకింగ్‌ జరుగుతున్నాయని ప్రధానంగా పిటిషన్‌దారులు వాదిస్తున్నారని, అయితే ఆధార్‌ డేటా హ్యాకింగ్‌ చేశారనే వార్తలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టంచేసిందని కోర్టు వెల్లడించింది. అయితే రాష్ట్రాలు సహా ప్రైవేట్‌ కంపెనీలు, మొబైల్‌ కంపెనీలు ఆధార్‌ డేటాను కోరడానికి వీల్లేదని కోర్టు స్పష్టంచేసింది. కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. సుమారు బిలియన్‌ మందికి పైగా భారతీయులు ఆధార్‌ నమోదు చేసుకున్నారని కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది.
సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పు వివరాలు…
ఆధార్‌ను వ్యక్తిగత స్వేచ్చకు ఆధార్‌ అవరోధం కాదని ఆధార్‌ అధికారిక పక్రియను, వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచాలని కోర్టు సూచించింది. ప్రభుత్వ సంస్థలు ఆధార్‌ డేటా షేర్‌ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. సేర్‌ చేసిన డేటాను ఆరునెలల లోపు తొలగించాలని సూచించింది. ప్రైవేట్‌ సంస్థలకు ఆధార్‌ డేటా ఇవ్వడం కుదరదని సుప్రింకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఇతరుల చేతిలోకి వెళ్లకుండా చూడాలని కేంద్రానికి సూచించింది. సమాచార భద్రత కోసం చట్టం తీసుకురావాలని, ఆధార్‌ పక్రియ స్వచ్ఛందంగా కొనసాగాలని పేర్కొంది. టెలికాం కంపెనీలు ఆధార్‌ అడగవద్దని కోర్టు సూచించింది. ఇప్పటి వరకు సేకరించిన యూజర్ల ఆధార్‌ నెంబర్లను టెలికాం కంపెనీలు డిలీట్‌ చేయొచ్చుని పేర్కొంది. బ్యాంక్‌ సేవలకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరి కాదని సూచించింది. స్కూల్‌ అడ్మినిషన్లకు ఆధార్‌ తప్పనిసరి కాదని, పాన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులకు మాత్రం ఆధార్‌ కచ్చితంగా కావాలని కోర్టు స్పష్టం చేసింది. సీబీఎస్‌, నీట్‌, యూజీసీకి ఆధార్‌ తప్పనిసరి కాదని, అక్రమ వలసదారులకు ఆధార్‌ అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.