ఆపద సమయంలో ఆగమాగం.. ఇదేనా కేంద్రం తీరు!
` బాధితులు బయటపడితే మా బలం, బలైతే వాళ్ళ బాధ్యతారాహిత్యం అంటూ ప్రచారం
` నాడు లాక్‌డౌన్ సమయంలో రోడ్లెంబడి బారులు తీరిన కార్మికులు
` నేడు ఉక్రెయిన్ సరిహద్దుల్లో బిక్కుబిక్కుమంటూ విద్యార్థుల కాలిబాట
` యుక్రెయిన్‌లో ఉన్న తమ పౌరులను జనవరి నుండే అప్రమత్తం చేసిన ఇతర దేశాలు
` ప్రయాణ ఖర్చులు భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాక ‘మేమే భరిస్తాం’ అంటూ ముందుకు వచ్చిన కేంద్రప్రభుత్వం
` యుక్రెయిన్ ‘బంకర్లలో’ ఉన్న విద్యార్థుల కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
హైదరాబాద్,మార్చి 4(జనంసాక్షి):గత కొన్ని నెలలుగా రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నప్పటికీ భారత ప్రభుత్వం అప్రమత్తం కానందునే ఇప్పుడు యుక్రెయిన్లో మన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా దేశాలు యుక్రెయిన్ లో ఉన్న తమ పౌరులను జనవరి నుండే అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేశాయి. తద్వారా చాలామంది యుక్రెయిన్ నుండి సురక్షితంగా బయటపడ్డారు. కానీ రష్యా సైనికచర్య ప్రారంభించిన ఫిబ్రవరి 24 కు నాలుగు రోజుల ముందు అనగా ఫిబ్రవరి 20 న యుక్రెయిన్ లోని భారత ఎంబసీ కార్యాలయం ‘యుక్రెయిన్ లో నెలకొన్న అనిశ్చితి, ఉద్రిక్తతల కారణంగా భారత పౌరులు తాత్కాలికంగా యుక్రెయిన్ ను వదిలి వెళ్ళాలి’ ఒక అడ్వైజరీ విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఫిబ్రవరి 24న రష్యా సైనిక దాడి ప్రారంభించగానే యుక్రెయిన్ తమ గగనతలాన్ని ‘నో ఫ్లయ్ జోన్’గా ప్రకటించిన విషయం విదితమే. దీనితో భయాందోళనలకు గురైన యుక్రెయిన్ లో చదువుచున్న భారతీయ వైద్యవిద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని యుక్రెయిన్ సరిహద్దులోని హంగేరి, పోలండ్, రొమేనియా, స్లోవేకియా, మోల్డోవా వైపు రైలు, రోడ్డు మార్గాల ద్వారా బయలుదేరారు. విద్యార్థులు కాలినడకన యుక్రెయిన్ సరిహద్దులు దాటుతున్న దృశ్యాలు చూస్తుంటే లాక్ డౌన్ సమయంలో కార్మికులు రోడ్లెంబడి బారులు తీరిన దృశ్యాలే గుర్తుకొస్తున్నాయి. యుద్ధం ప్రారంభమయ్యాక మంత్రులను, సైనిక విమానాలను రంగంలోకి దింపి హడావుడి చేస్తున్న కేంద్రప్రభుత్వం ముందే అప్రమత్తమై ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఇంత ఆందోళన చెందేవారు కాదు. దురదృష్టవశాత్తు ఇప్పటికే ఇద్దరు వైద్యవిద్యార్థులు మరణించడం విచారకరం. ఇప్పటికి కూడా ప్రాణాలకు తెగించి యుక్రెయిన్ దాటివచ్చిన విద్యార్థులకు స్వాగతం చెపుతూ మంత్రులు, అధికారులు సంబురాలు చేసుకుంటున్నారే కానీ యుక్రెయిన్ బంకర్లలో ఉన్న భారతీయ విద్యార్థులను రక్షించేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనపడటం లేదు. ఇప్పటికైనా యుక్రెయిన్లో ఉన్న విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడేందుకు కేంద్రప్రభుత్వం తగినచర్యలు తీసుకోవాలి. యుద్ధం ముగియాలి.. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి.