‘ఆపరేషన్ ఎక్స్’.. సక్సెస్! కసబ్ ఉరితీత ప్రక్రియకు రహస్య కోడ్
ముంబై, నవంబర్ 21 :’ఆపరేషన్ ఎక్స్’.. కసబ్ ఉరితీత కోసం మహారాష్ట్ర పోలీసులు పెట్టుకున్న కోడ్ నేమ్ ఇది. అత్యంత రహస్యంగా కసబ్‌ను ఉరితీత ప్రక్రియను పూర్తి చేసిన మహారాష్ట్ర పోలీసులు దిగ్విజయవంతంగా పూర్తి చేశారు. ‘ఆపరేషన్ ఎక్స్’కు మహారాష్ట్ర స్పెషల్ ఐజీ (శాంతిభద్రతలు) దేవన్ భారతీ నాయకత్వం వహించారు. నవంబర్ 5వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంతో ‘ఆపరేషన్ ఎక్స్’కు బీజం పడింది. అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ బుధవారం పూర్తయింది. ఈ ఆపరేషన్‌లో దేవన్ భారతీతో పాటు 17 మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కసబ్ ఉరితీత పూర్తయ్య వరకు వీరి ఫోన్లన్నీ స్విచాఫ్ ఉన్నాయి. నవంబర్ 7న కసబ్ ఉరితీత అమలుకు సంబంధించిన ఫైలుపై కేంద్ర ¬ం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే సంతకం చేశారు. 8వ తేదీన ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించారు. నవంబర్ 21న కసబ్‌ను ఉరి తీయాలని అదే రోజు నిర్ణయించిన ప్రభుత్వం.. కసబ్ తరలింపు, ఉరితీత, ఇతర విధి విధానాల కోసం ‘ఆపరేషన్ ఎక్స్’ పేరుతో కార్యాచరణ ప్రారంభించింది. అందులో భాగంగానే నవంబర్ 19న ముంబైలోని ఆర్థర్ జైలు రోడ్ నుంచి కసబ్‌ను పుణెలోని ఎరవాడ జైలుకు అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించారు. అక్కడ అన్ని విధివిధానాలు పూర్తి చేసిన అనంతరం బుధవారం ఉదయం 7.30 గంటలకు కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేయడంతో ‘ఆపరేషన్ ఎక్స్’ సక్సెస్ అయింది. ఈ మేరకు ‘ఆపరేషన్ ఎక్స్.. సక్సెస్’ అని భారతీ కేంద్ర ¬ం శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమివ్వడంతో.. కసబ్ ఉరిశిక్ష అమలు విషయం వెలుగులోకి వచ్చింది.