ఆప్ నుంచి ఆ ఇద్దరినీ బహిష్కరించారు..

ఆప్ నుంచి ఆ ఇద్దరినీ బహిష్కరించారు..
 న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో రగిలిన  విభేదాల సెగ అసమ్మతి నేతల బహిష్కరణకు దారితీసింది. అనుకున్నట్లుగానే  పార్టీ వ్యవస్థాపక సభ్యులైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ను పార్టీ నుంచి తొలగిస్తూ శనివారం జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుంవడా వారిద్దరికి అండగా ఉన్న ఆనంద్ కుమార్, అజిత్ షాను కూడా తొలగించినట్టు  సమాచారం. మరోవైపు తమపై బహిష్కరణ వేటును ఇరువురు నేతలు ఖండించారు.  సమావేశం జరుగుతున్నపుడు తమ మద్దతుదారులపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. సమావేశంలో జరిగిన ఓటింగ్ తతంగమంతా ఒక ఫార్స్ అని వ్యాఖ్యానించారు.

పార్టీ రాష్ట్ర శాఖలకు స్వతంత్ర ప్రతిపత్తి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కేజ్రీవాల్ ప్రయత్నించారన్న ఆరోపణలపై అంతర్గత లోక్‌పాల్‌తో విచారణ, పార్టీ నిర్ణయాల్లో కార్యకర్తల భాగస్వామ్యం పెంచటం, ఆర్టీఐ పరిధిలోకి పార్టీని తీసుకురావటం వంటి డిమాండ్లను ప్రశాంత్ భూషణ్,  యోగేంద్ర యాదవ్. ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

పార్టీ వ్యవస్థాగత సిద్ధాంతాలు, అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో కేజ్రీవాల్ రాజీపడుతున్నారని  ఇద్దరు నేతలు ఆరోపించారు. తాము ప్రస్తావించిన ఐదు డిమాండ్లను పరిష్కరిస్తే పార్టీలోని అన్ని పదవులనూ వదులుకుంటామన్నప్పటికీ  కేజ్రీవాల్ పట్టించుకోలేదని ఆరోపించారు.
కేజ్రీవాల్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారంటూ కేజ్రీవాల్‌పై స్టింగ్ ఆపరేషన్ చేసిన ఓ ఆడియో టేప్‌ను అసమ్మతి వర్గం శుక్రవారం విడుదల చేసింది. దీంతో పార్టీలో కుమ్ములాటలు పతాకస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.